న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప ఎవరి పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదని అమిత్ షా స్పష్టం చేశారు.‘‘సీఏఏ (CAA) అనేది ఇప్పుడు భారత దేశపు అవసరం. ఈ చట్టాన్ని ఎన్నికలకు ముందు నోటిఫై చేసి, అమలు చేస్తాం. దాని చుట్టూ ఎలాంటి గందరగోళం ఉండకూడదు. మన దేశంలో మైనారిటీలను, ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని హరించదు. ఎందుకంటే ఈ చట్టంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవు. బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో హింసకు గురై భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పించే చట్టం సీఏఏ’’ అని ఢిల్లీలో జరిగిన ఈటీ నౌ-గ్లోబల్ బిజినెస్ సదస్సులో అమిత్ షా వివరించారు.
సీఏఏ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత 2019 డిసెంబర్ 4న అసోంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11, 2019 న ఈ చట్టం ఆమోదం పొందిన తరువాత దేశవ్యాప్తంగా ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. సీఏఏ వివక్షాపూరితమని, భారత లౌకికవాదంపై దాడి అని నిరసనకారులు పేర్కొన్నారు. నిరసనల సమయంలో కానీ, పోలీసుల చర్య వల్ల కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దేశంలో సీఏఏను అమలు చేస్తామని ఇచ్చిన హామీపై గత కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అమిత్ షా ఆరోపించారు. ‘‘సీఏఏ ను అమలు చేస్తామని మొదట హామీ ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ హామీని ఆ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. పొరుగు దేశాల్లోని మైనారిటీలు హింసకు గురైనప్పుడు, వారిని శరణార్థులను భారత్ కు ఆహ్వానిస్తామని, వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు వారు వెనకడుగు వేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.