ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత కాలంగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన మాటను హైకమాండ్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాగుంట విషయంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని… తాను మాత్రమే హైక మాండ్ తో ఎందుకు ఘర్షణ పడాలని ప్రశ్నించారు. ఎంపీగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితేనే బాగుంటుందనేది తన భావన అని బాలినేని చెప్పారు. మాగుంట ఎంపీ అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

