డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
ప్రజాభూమి, వేంపల్లె
సిఫాయిల తిరుగుబాటుకు 10 ఏళ్లముందే ఆంగ్లేయుల దుష్టపాలనపై తిరుగుబాటు చేసి, వీరమరణం పొందిన ప్రప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అని కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. శుక్రవారం నరసింహరెడ్డి 217 వ జయంతిని ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తులసిరెడ్డి మాట్లాడుతూ నరసింహరెడ్డి పోరాటపటిమ, వీరత్వం ప్రతి తెలుగువాడికి, భారతీయుడికి స్పూర్తిదాయకమన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుష్టపాలనపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
మౌలానా ఆజాద్ అసలైన జాతీయవాది
భారతరత్న, దేశతొలి విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ అసలైన జాతీయవాదని తులసిరెడ్డి అన్నారు. హిందూ-ముస్లిం ఐక్యత, కాంగ్రెస్ పార్టీ పటిష్టత, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహానీయుడన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే అంతర్జాతీయ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులు రక్తదానం చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఎంతోమందికి ప్రాణదాతలవుతారని తులసిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు అమర్నాథరెడ్డి, ఉత్తన్న, బాలం సుబ్బరాయుడు, బద్రీ, వినయ్, రవి తదితరులు పాల్గొన్నారు.