ఎస్టీయు రాష్ట్ర అదనపుప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి
పోరుమామిళ్ల :
ఉపాధ్యాయ,విద్యారంగ సంక్షేమంలో ఎస్టీయు పాత్ర ఎనలేనిదని ఎస్టీయు రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి పి.రమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోరుమామిళ్లలోని ఎస్టీయు భవన్ నందు రీజనల్ కన్వీనర్ వి.వి.క్రిష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎస్టీయు 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఎస్టీయు జెండా ఆవిష్కరణ గావించిన తదనంతరం కేక్ కట్ చేసి, ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు స్వర్గీయ వీణా విజయరామరాజు,మగ్ధూం మొహియుద్దీన్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. తదనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్న రమణారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి పూర్వమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించిన సంఘం ఎస్టీయు అని తెలిపారు. ఎన్నో చారిత్రక ఉద్యమాలకు సారథ్యం వహించి,ముందుండి నడిపించిన సంఘమనీ,ఉపాధ్యాయలోకం ప్రస్తుతం పొందుతున్న సౌలభ్యాల సాధనలో ఎస్టీయు చేసిన కృషి ఎంతైనా కొనియాడదగినదన్నారు. రీగ్రూపింగ్ పేస్కేల్స్,ఇంక్రిమెంట్లు, డిఎ,హెచ్ఆర్ఎ,ఎఎయస్,పదోన్నతుల సాధనలో ఎస్టీయు ముందుండి నడిపిన పోరాటాలతోనే సాధ్యమైందన్నారు.
రాష్ట్ర కౌన్సిలర్లు యు.సుబ్రమణ్యం, ఓ.చంద్రహాసరెడ్డిలు మాట్లాడుతూ నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలియజేశారు. నూతన ప్రభుత్వమైనా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపట్ల దృష్టి సారించాలన్నారు. సిపియస్ రద్దు,117 జివో రద్దు చేయడంతో పాటు, గత పీఆర్సీ మరియు డిఎ బకాయిలు చెల్లించాలన్నారు. పీఆర్సీ అమలు లోపు మధ్యంతరభృతి ప్రకటించాలన్నారు.యాప్ ల గోల తగ్గించి బోధనకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి.రత్నస్వామి, బి.సుబ్బారెడ్డి,బాలరాజు,వాకా చంద్రశేఖర్,కుళ్లాయప్ప,జిల్లా కార్యవర్గసభ్యులు పుల్లారెడ్డి, కుళ్లాయప్ప,వెంకటరామయ్య,రాజగోపాల్ రెడ్డి,శ్రీనివాసులు, నారాయణరెడ్డి,అబ్దుల్ హుసేన్,శివారెడ్డి, మండల కార్యవర్గసభ్యులు జయరామిరెడ్డి,రవీంద్రబాబు,బాలఓబయ్య,ప్రసాద్,శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
