గాజువాక:
స్టీల్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు మరియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఈడి (వర్క్స్) కార్యాలయంలో వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పెద్ద ఎత్తున జీతాలు చెల్లించాలని, పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలని నినాదాలతో నినదించారు. ధర్నా అనంతరం ఈడి (వర్క్స్) సోబ్తి గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల 7వ తారీకు లోపు జీతాలు చెల్లించాలని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. కానీ యాజమాన్యం దానికి విరుద్ధంగా గడచిన మూడు మాసాలుగా సకాలంలో జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగుల జీతాల కోసం కేవలం 90 కోట్లు చెల్లించకుండా కావాలనే యాజమాన్యం కుంటి సాకులు చెబుతుందని ఆయన వివరించారు. దీనిపై స్టీల్ సిఎండి ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. తక్షణమే జీతాలు చెల్లించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ యాజమాన్యం వైఖరిని అడ్డుకోవాల్సిన గుర్తింపు యూనియన్ తన బాధ్యతను మరచి వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన అసమర్ధతను అన్ని సంఘాల పైన బాధ్యతను నేడుతోందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి బాహాటంగా మద్దతు ఇచ్చిన ఐ ఎన్ టి యు సి నోరుమెదని ఆయన అన్నారు. కనుక ఈ పరిస్థితిని అధిగమించడానికి భవిష్యత్తులో ఆందోళనలను తీవ్రతరం చేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ దీనిని పూర్తిస్థాయిలో నడపడానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్న వీటిని పరిగణలోకి తీసుకోవటం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనికి గల భూములు రాష్ట్రపతి పేరులో ఉన్నాయని వీటిని కర్మాగారం పేరున మార్చితే దీని విలువ పెరుగుతుందని, తద్వారా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయని ఆయన వివరించారు. అలాగే దీనిని సెయిల్ లో విలీనం చేయడం ద్వారా దీనిని రక్షించవచ్చని ఆయన అన్నారు. ఈ పచ్చని చెట్టును నరికివేయాలని ప్రభుత్వ ఆలోచన విధానం మారాలంటే ప్రభుత్వంపై పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ మిత్రపక్షాల నాయకులు డి వి రమణారెడ్డి, డి సురేష్ బాబు, సిహెచ్ సన్యాసిరావు, స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, గంగాధర్, నీలకంఠం, మరిడయ్య, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, వి మురళి, రాజు తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.