Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఉద్దేశం ఏంటి.. వ్యవహారం ఏంటి?

ఉద్దేశం ఏంటి.. వ్యవహారం ఏంటి?

  • చేతి వృత్తులు ఫుట్ పాత్ పైన
  • ప్రవేట్ సంస్థలకు లీజు పేరుతో దారాదత్తం
  • శిల్పారామం ఉన్నత అధికారుల చేతి వాటం
  • వెనకున్న అదృశ్య శక్తి ఎవరూ?

తురక అమరనాథ్ తిరుపతి ప్రజాభూమి ప్రత్యేక ప్రతినిధి

శిల్పారామం అంటేనే సాంప్రదాయ కళలు, చేతివృత్తులు, పర్యాటకం, సంస్కృతిని ప్రోత్సహించే కేంద్రం. భారతీయ కళల చరిత్ర, హస్తకళల ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కళాకారుల ప్రతిభకు వేదిక కల్పించడమే దీని అసలు ఉద్దేశం. కానీ తిరుపతి శిల్పారామం విషయానికి వస్తే, ఈ లక్ష్యం పూర్తిగా దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఉన్నతధికారులు, రాజకీయ శక్తుల ద్వారా పక్కదారి పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి శిల్పారామంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల చేతివాటంతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారనే అభియోగాలు కళాకారుల, సంఘాల నుంచి చేతి వృత్తులు వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ప్రజల మనసుల్లో ఒక్క ప్రశ్న మెదులుతుంది శిల్పారామం ఉద్దేశం ఏంటి, వ్యవహారం ఏంటి? అని. ఇంతటి వ్యవహారాన్ని చేసి తమకేమి తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు మంచివారే గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనుకుందాం! మరి మంచి ప్రభుత్వం మంచి అధికారులు నియమించాక జరిగిందేంటి? ఆపే బాధ్యత, హక్కు ఉన్నతాధికారులకు లేదా అన్నది మేధావుల ప్రశ్న? ఇలాంటి అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్న నిమ్మకు నీరుతున్నట్లు శిల్పారామం అధికారుల వ్యవహారం కొనసాగుతూనే ఉంది.

చేతివృత్తుల స్థానం ఫుట్‌పాత్ పైనే!

ఒకప్పుడు శిల్పారామంలో తమ సాంప్రదాయ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు విక్రయిస్తూ జీవనం సాగించిన కళాకారులు, ఇప్పుడు ఫుట్‌పాత్ పైన చిన్నచిన్న స్టాళ్లలో రోజువారీ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక మరోవైపు, అధికారుల చేతివాటంతో శిల్పారామం భూమిని ప్రైవేట్ సంస్థలకు లీజు పేరుతో దారాదత్తం చేశారు. ధన బలంతో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర ఉన్నతాధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని, నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తు చివరి దశలో ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతుండటం వెనుక ఏ అదృశ్య శక్తి ఉన్నది? అనే ప్రశ్న ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. లోపల ఉండాల్సిన వారు బయట ఫుట్ పాత్ ల పైన రోజువారి వ్యాపారం చేసుకుంటుంటే. బయట ఉండాల్సిన వ్యక్తులు (సంస్థలు) దర్జాగా ప్రభుత్వ స్థలంలో శాశ్వత భవనాలు నెలకొల్పుకొని వ్యాపార రంగాన్ని విస్తరించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉందా? అని అనుమానం వ్యక్తం అవుతుంది. తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, మాధవమాల గ్రామం, అక్కడ తయారయ్యే కలప బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గ్రామంలోని మూడు వందల కుటుంబాలు ఈ కళపై ఆధారపడి జీవిస్తున్నాయి. పూర్వీకుల కాలం నుండి వంశపారంపర్యంగా సాగుతున్న ఈ కళ నేటికీ ఆ గ్రామానికి జీవనాధారం. అలాగే శ్రీకాళహస్తి కలంకారీ కళ శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి మొదలై, ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఈ కళలో ప్రతిభ చూపిన శ్రీకాళహస్తికి చెందిన రామచంద్రయ్య గిన్నిస్ రికార్డు పొందారు. కానీ ఇలాంటి ప్రతిభావంతుల కళాకారులకు శిల్పారామంలో చోటు దక్కకపోవడం బాధకరం. జిల్లాలో ఇలాంటి అనేక చేతి కళావృత్తులు ఉన్న వారికి అర్దిక, ఆదరణ కరువై వృత్తినే విస్మరించే ప్రమాదంలో జారుకుందంటే తప్పు ప్రభుత్వానిదా? లేక ప్రైవేటు సంస్థల కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులదా? అని అనేక సందేహాలు తలెత్తుతున్నా యి.

కళాకారులను విస్మరించి, డబ్బు బలం ఉన్న ప్రైవేట్ సంస్థలకు శిల్పారామం దారాదత్తం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములు మిగిలి ఉంటాయి? అనే ఆవేదన అటు ప్రజల్లో, ఇటు చేతి వృత్తి కళాకారులలో మిగిలిపోయింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములు, అందులోను చేతి వృత్తులు చేసుకుని జీవనం సాగించే వారి కోసం కేటాయించాల్సిన భూములను ప్రైవేటు సంస్థలు అప్పజెప్పడం వెనుక ఆంతర్యమేమిటి అని, ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మేధావుల నోటి మాటగా మారింది. ఇన్ని జరుగుతున్న శిల్పారామం చైర్మన్ కానీ, సీఎంఓ కానీ ఇతర ఏ అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదంటే శిల్పారామంలో ఏం జరుగుతుంది?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article