కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ విజ్ఞప్తి.
పోరుమామిళ్ల :రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి ముందుగా శుభాకాంక్షలు ఈసారైనా ప్రత్యేక హోదా సాధించాలని కాంగ్రెస్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అన్వర్ విజ్ఞప్తి చేశారు.
2014వ సంవత్సరంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా కూటమిలో ఉండి కూడా, ఆ సమయంలో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బాబు సాధించలేక, “ఎన్డీఏ” కూటమి నుంచి విభేదించి, 2019లో అధికారం కోల్పోయారు. తిరిగి అదే సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కూడా, కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పి, సాధించలేక చతికిల పడ్డాడు. ఇదే కాకుండా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కారణంగా, రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో కూడా స్పష్టమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ అవసరం చాలా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, సొంత ప్రయోజనాల కోసం పోకుండా, రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, పోలవరం తదితర ప్రయోజనాలను సునాయాసంగా తీసుకునే అవకాశం, రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏలో భాగమైన జనసేనకు ఇవ్వడం వలన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,రాష్ట్ర ప్రభుత్వానికి రావలసినటువంటి ప్రత్యేక హోదా సాధించాలని, లేని పక్షంలో “ఎన్డీఏ” కూటమి నుంచి వైదొలగి, మేము ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్నా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఇండియా కూటమికి మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.