నిస్సహాయను నిలువునా కూల్చేసే నరరూపరాక్షసుడి
జుగుప్సాకర ప్రతాపం..!
ఏం జరుగుతోంది మన సమాజంలో..
రోజుకో కోణంలో
కనిపిస్తుందేమిటి
మనిషి నైజం
ఏదో రూపంలో
ఆడకూతురుపై దౌర్జన్యమేనా..
మనం నేర్చిన చదువు..
గురువులు చెప్పిన బుద్దులు..
పెద్దలు బోధించిన సుద్దులు..
చిన్నతనంలో అమ్మానాన్న
నేర్పిన పాఠాలు..
తాతలు బామ్మలు
చూపిన బాటలు..
జీవితంలో అనుభవాలు నేర్పిన గుణపాఠాలు…
సంస్కృతి నేర్పిన సంస్కారం..
రామాయణం
చూపిన మార్గం..
ఏమైపోయాయి ఇవన్నీ..!?
అసలు ఏమిటీ విపరీతం..
ఏమైపోయింది
మనిషిలోని ఇంగితం..
అమ్మ,అక్క,చెల్లి,వదిన,
భార్య..కూతురు..
ఎవరూ గుర్తు రారా..
మనవరాలి వయసున్న పిల్ల..
మనవరాలే అని చెప్పి
అంతటి దుర్మార్గమా..?
అసలు అడిగేవాడే లేడనా..
నీలో మానవతే లేదనా..
ఎప్పుడో రాక్షసులు
ఇలా చేశారని..
రాతి యుగంలో
సంస్కారం ఎరగని
మనుషులు అలా ప్రవర్తించేవారని విన్నాం..
ఛీ అనుకున్నాం..
ఇప్పుడు చూస్తున్నాం..
ఛీదరించుకుంటున్నాం..
ఛీత్కరించుకుంటున్నాం..!
ఓ మనిషి
పశువుగా మారి..
చిన్నారిని..
ఇంత కర్కశంగా..
మంచి మరచి..
విజ్ఞత విడిచి..
విచక్షణ విస్మరించి..
మానవతను మంటగలిపి..
దానవతను కలగలిపి..
దౌర్జన్యం చేయడం..
నీచం.. హేయం..
(అతడు ఆత్మహత్య చేసుకుని
ఉండవచ్చు గాక)
అయితే ఇలాంటి ఆకృత్యాలు
ఇప్పుడే మొదలు కాదు..
కాని తుది కావాలి..
ఇలాంటి పైశాచికాలకు
ఇక చరమగీతం పలకాలి..
ప్రభుత్వాలు కదలాలి
న్యాయస్థానాలు స్పందించాలి..
ఇలాంటి నేరాలలో
ముష్కరులను
సత్వరమే శిక్షించాలి..
రేపు మరో రాక్షసుడు లేవకుండా..
ఎల్లుండి ఇంకో అకృత్యానికి
తావు లేకుండా..
కఠిన దండన..
వచ్చినా రాకున్నా..
కర్కోటకులలో పరివర్తన..
అది రేపటి
మరో కంటకులకు
కావాలి హెచ్చరిక..
ఇదే..ఇదే..
ఈ వేదభూమిలో
ప్రతి తల్లి పొలికేక..!
(కాకినాడలో మైనర్ బాలికపై
వృద్ధుడి అత్యాచారం..
తాతనని చెప్పి బడి నుంచి
తీసుకువెళ్ళి ఘాతుకం..
నన్ను కదిలించిన
ఈ దారుణంపై నా స్పందన)
సురేష్..9948546286
7995666286

