Wednesday, December 31, 2025

Creating liberating content

తాజా వార్తలుఇటు సంక్షేమ పథకాలు…అటు అభివృద్ది పరుగులు

ఇటు సంక్షేమ పథకాలు…అటు అభివృద్ది పరుగులు

2025 లో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం

సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ తో 2025లో కూటమి పాలన

సుపరిపాలనతో బ్రాండ్ ఇమేజ్….ప్రభుత్వ చొరవతో లక్షల కోట్ల పెట్టుబడులు

పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ఆశలకు నాంది

నాడు భూముల కబ్జా… నేడు రాజ ముద్రతో దర్జా

సంస్కరణల బాట పట్టిన విద్యా-వైద్య రంగాలు…ఇరిగేషన్ లో మార్పులు

అద్భుత వేగంతో అమరావతి… పూర్తి దిశగా పోలవరం

2025లో నాయుడు గిరీని పరిచయం చేసిన సీబీఎన్

2025లో ఉషోదయం… ఇక 2026లో నవోదయం

కొత్త ఏడాదిలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

ప్రజల ఆశలను నెరవేర్చిన 2025…. ఆకాంక్షలు తీర్చేలా 2026

అమరావతి:2025 ఏడాదిలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధించింది. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను నెరవేర్చింది. చెప్పని అంశాలను ప్రజలకు అందించింది. విభజనను మించిన విధ్వంసాన్ని 2019-2024 మధ్య కాలంలో గత పాలకులు చేశారు…ప్రజలు అనుభవించారు. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి తొలి ఆరు నెలలు అస్తవ్యస్తమైన వ్యవస్థలను సరి చేయడానికే కాలం సరిపోయింది. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేనంత రీతిలో అన్ని వ్యవస్థలను నాశనం చేసేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. దీంతో విభజన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నాటి ప్రభుత్వం శ్రమించిన దానికంటే రెండింతలు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2025 తొలి నాళ్లల్లో రాష్ట్రంలోని వ్యవస్థలు నెమ్మదిగా గాడిలో పడ్డాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమాన్ని… అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కనీ వినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించినా… 2025 సంవత్సరంలో మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్రం పూర్తి స్థాయిలో అందిస్తున్న సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ప్రభుత్వ యంత్రాంగం అందిపుచ్చుకుంది. వివిధ రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు… ప్రభుత్వం తీసుకున్న 23 పాలసీలతో దేశాన్ని ఆకర్షించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరిచింది. ప్రముఖ ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025ను అందించింది. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందనే విషయాన్ని చెప్పడానికి చంద్రబాబుకు దక్కిన ఈ అవార్డే నిదర్శనం.

సంక్షేమానికి చిరునామాగా…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూనే ఉంది. 2025 ఏడాదిలో కూటమి ప్రభుత్వం చూపించిన ప్రగతి వేరే లెవల్ అని చెప్పాల్సిందే. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసింది. తల్లికి వందనం కింద రూ.10,090 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో వేసింది. దీని ద్వారా 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం అందింది. ఇక స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తే… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల మేర ఖర్చు అయింది. ఇక దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. వారి ఖాతాల్లో రూ.6,310 కోట్లు జమ అయ్యాయి. దీపం–2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్‌లను మహిళలకు ఉచితంగా అందించారు. దీని కోసం రూ.2,684 కోట్లు ఖర్చు పెట్టారు… ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేపట్టారు. ఇక సామాజిక భద్రత ఫించన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లను పంపిణీ చేశారు. అర లక్ష కోట్ల రూపాయల పంపిణీని పూర్తి చేసిన ఘనతను 2025వ సంవత్సరం దక్కించుకుని చరిత్రలో నిలిచిపోయింది. ఇక వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ స్కీంలను అమలు చేసింది కూటమి ప్రభుత్వం. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు పంపిణీ చేపట్టింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు రూ.15,000… చొప్పున 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు జమ చేసింది కూటమి సర్కార్. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం రూ.51 కోట్లు పంపిణీ చేపట్టారు. అలాగే ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు ఇచ్చారు. పురోహితులకు నెలకు రూ.15,000 వేతనం, నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాలను పెంచారు. ఇక జూనియర్ లాయర్‌లకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇవి కాకుండా… వివిధ వర్గాలను ఆదుకునేందుకు వారికి అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో భాగంగానే మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించారు. మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ అందుతోంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపులు జరిగాయి. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ – స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం చేశారు. ఇక గత పాలకులు కనికరం లేకుండా పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. వాటిని పునరుద్దరించిన కూటమి ప్రభుత్వం… మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసి… ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు పెట్టింది.

కొలువుల జాతర… ఉద్యోగ నియామకాలు

ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీలో భాగంగా ప్రభుత్వం తరపున భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టడమే కాకుండా… ఎన్నో అడ్డంకులను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించింది 15491 మందిని టీచర్లుగా రిక్రూట్ చేసింది. ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీని 2025లో అమలు చేసింది కూటమి సర్కార్. ఇదే కాకుండా… కానిస్టేబుల్ పోస్టుల నియామకాన్ని పూర్తి చేసింది.. 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందచేసింది కూటమి ప్రభుత్వం. అలాగే శిక్షణ పొందే పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసిందీ ఈ సంతవత్సరమే. ఇక గత ప్రభుత్వం వారసత్వంగా అప్పులనే కాదు.. చెత్తను కూడా అందించింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్తను ఎక్కడిదక్కడే వదిలేసి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగింది. ఈ చెత్తను పూర్తిగా తొలగించడమే కాకుండా…ఈ చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది పట్టణాభివృద్ధి శాఖ. ఇక గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వేల కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది రోడ్ల మరమ్మత్తుల నిమిత్తం రూ.1,000 కోట్ల కేటాయించింది కూటి సర్కారు. అలాగే మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చరిత్రను తిరగరాసేలా పారిశ్రామికాభివృద్ధి

ఇక 2025 ఏడాదిలో ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది… చరిత్రను తిరగరాసే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా ఐటీ, ఏఐ డేటా సెంటర్ తదితర రంగాల్లో కీలక పెట్టుబడులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మైక్రో సాఫ్ట్ తెచ్చి చంద్రబాబు అభివృద్ధికి బాటలు వేశారు. దాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేలా ఈ ఏడాది విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది. ఈ కలను సాకారం చేసే విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక భూమిక పోషించారు. ఇవే కాకుండా… కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా మొత్తంగా 23 కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. అలాగే పరిశ్రమలకు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరవాలనే నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల నిమిత్తం ఎస్క్రో ఖాతాలు తెరిచే తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోయింది. ఇక విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ది మరో చరిత్ర అనే చెప్పాలి. ఈ సదస్సులో 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్దమైంది. ఇప్పటి వరకూ జరిగిన 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ పాలసీ వంటివి అభివృద్ధి పుంజుకునేందుకు దోహదం చేస్తున్నాయి. ఇక ఈ ఏడాది విశాఖ రూపు రేఖలు మారి… అంతర్జాతీయ స్థాయి నగరంగా ఆవిర్భవించేందుకు బీజాలు పడ్డాయి. విశాఖను ఐటీ హబ్ చేసేలా గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగాయి. విద్య, వైద్యం, రవాణా తదితర రంగాల్లో పరిశోధనలతో పాటు ఇతర అంశాల్లో వినియోగం కోసం ఏర్పాటు అవుతున్న అమరావతి క్వాటం వ్యాలీకి ఈ ఏడాదే అడుగులు పడ్డాయి. రూ. 50 వేల కోట్లకు పైగా వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఈ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోవడం…స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామిక రంగానికి అనుకూలంగా పాలసీలు తీసుకురావడంతో సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక ఎకనమిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వరించింది. నాయుడు గిరీ అంటే ఏంటో సీఎం చంద్రబాబు చూపించారు. 2025లో కూటమి పనితీరు ఎంత అద్భుతంగా ఉందోనని చెప్పడానికి చంద్రబాబుకు వచ్చిన అవార్డే నిలువెత్తు నిదర్శనం.

ప్రక్షాళన చేశారు… పరుగులు పెట్టిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మెజార్టీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. విద్యా వైద్య రంగాలు కుదేలయ్యాయి. ఇక దేవదాయ శాఖ, టీటీడీ వంటి వ్యవస్థలు అపవిత్రం చేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇలా అస్తవ్యస్తమైన వ్యవస్థలను…వివిధ శాఖలను ఈ ఏడాది దాదాపు గాడిలో పడ్డాయనే చెప్పాలి. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు తెచ్చారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు ప్రారంభించారు. ఇక విశాఖలో యోగాంధ్ర నిర్వహణ ప్రపంచ రికార్డులను సృష్టించింది. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్ అయింది. అలాగే వైద్య రంగంలో సంస్కరణలు తెస్తూ… పేద వైద్య విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లను అందుబాటులో తెచ్చేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కీలక పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడిలో పడింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం చుట్టారు… మన గ్రామాల సత్తా చాటేలా ఈ గ్రామ సభలను నిర్వహించడంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపారు. ఇక అడవి తల్లి బాట కార్యక్రమంతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణంపై పవన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్ కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయి. అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు కల్పించారు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల చేశారు. 95 సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ చేయడం ద్వారా కేంద్ర నిధులు రాష్ట్రానికి వచ్చేలా వెసులుబాటు కల్పించారు. ఇక రాష్ట్రానికి కుంకీ ఏనుగులు వచ్చాయి. దీంతో పాటు ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించేందుకు రూ.3,050 కోట్లతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుని పవన్ ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. మొత్తంగా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సుతో కూటమి సర్కారు అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది.

సీమకు జలసిరులు… ధాన్య రాశులు… గృహప్రవేశాలు

అలాగే 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రికార్డు సృష్టించింది కూటమి ప్రభుత్వం. చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగు, తాగునీటిని ప్రభుత్వం అందించింది. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. ఇక పోలవరం పనుల్లో పురోగతి పరుగులు పెడుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులను వేగవంతం చేశారు. వేగంగా వెలిగొండ పనులను ప్రారంభించి… 2026లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రికార్డ్ స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం సేకరణ డబ్బులను జమ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఖరీఫ్‌ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ న్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం… 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ చేసింది. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం అందించింది. ఇలాంటి వివిధ రకాల చర్యల ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ చేరుకుంది. 11.28 శాతంగా నమోదు చేసుకుంది. అంతే కాకుండా… రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన మూల ధన వ్యయం కూడా పెరిగింది. అలాగే రెవెన్యూ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. నాలా చట్టం రద్దు చేశారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం, దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసింది. దీంతో పాటు 3 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి… లబ్దిదారులకు ఇళ్ల తాళాలను ఈ ఏడాదే ప్రభుత్వం అందచేసింది. ఇక గేట్స్ ఫౌండేషన్, టాటా సౌజన్యంతో సంజీవని ప్రాజెక్టు కుప్పంలో పైలెట్ గా ఏర్పాటు చేశారు. ఇది భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఈ పథకం సంజీవనిగా మారనుంది. అలాగే డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీల వంటి వాటితో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది కూటమి ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను విద్యార్థులకు ఎలాంటి రాజకీయ నేతల బొమ్మలు లేకుండా అందచేశారు. ఇక టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టి…ఆదర్శంగా నిలిచింది విద్యా శాఖ. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్ధులకు హెల్త్ చెకప్, విద్యార్ధుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

ఛార్జీలు తగ్గాయి… నేరాలూ తగ్గాయి..

గత ప్రభుత్వం పీపీఏల రద్దుతో పూర్తిగా విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. అలాంటి విద్యుత్ వ్యవస్థ ఈ ఏడాది గాడిన పడింది. విద్యుత్ ఛార్జీల పెంచుతూ… ప్రజలపై గత ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక భారాన్ని వేసింది. కానీ కూటమి ప్రభుత్వం తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసింది. దీంతో విద్యుత్ ఛార్జీలు కొంత మేర తగ్గాయి. ఇదే కాకుండా… విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర రూ.5.19 నుంచి రూ.4.80కు తగ్గేలా చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇక క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ – బీసీలకు రూ.20 వేల అదనపు సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక వైసీపీ ప్రభుత్వం క్రైమ్ రేట్ గరిష్టంగా ఉండేది. కానీ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్రైమ్ రేట్ తగ్గింది. నేరాలకు శిక్షలు పడ్డాయి. గంజాయి-డ్రగ్స్ అరికట్టేలా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇది చాలా వరకు సక్సెస్ అయింది. ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, పీ4 వంటి వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లుగా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. కీలకమైన పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కింది. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి. ఇక కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్దరించారు. కేంద్రం, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ నిలబడింది. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11440 కోట్లతో కేంద్రం ఊతమిచ్చింది. దీంతో లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి. ఇక ఈ ఏడాది చివర్లో కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం లభించింది. దీంతో 26 నుంచి 28కి ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుంది.

2026లో ఘనమైన లక్ష్యాలు

ఇక 2026వ ఏడాదిలో కూడా ఘనమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలను వీలైనంత ఎక్కువ స్థాయిలో పరిష్కరించాలని, వివాదాల్లేని భూములను రైతులకు, భూ యజమానులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు మరింతగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంతోపాటు… సంపద సృష్టి, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలపై దృష్టిపెట్టేలా కూటమి ప్రభుత్వం నూతన ఏడాదివైపు ముందడుగు వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article