ఒకప్పుడు రాజకీయాలంటే నిజాయితీ..
ఇప్పుడు నీది ఏ జాతి..
కులమే సీటు…కులమే ఓటు
కులమే నోటు..కులమే ఫీటు
అదే రుణం..అదే రణం
అదే ఆభరణం..అదే వ్రణం..
కులాల కోసం పోరాటాలు..
ఆరాటాలు..చెలగాటాలు..
జంజాటాలు..పితలాటాలు..
పిక్నిక్కులు..టెక్నిక్కులు..
మాది ఫలానా కులమని టెక్కునిక్కులు..ఇతర కులాలవారిపై భిన్నదృక్కులు..
పెళ్ళిళ్ళు..పేరంటాలు..
బంతి భోజనాలు..
గ్రూపులు.. సోపులు..
జంపులు.. కేంపులు..
లేటెస్టుగా వాట్సప్ గ్రూపులు
భజన ట్రూపులు
ఎవడికి వాడే తోపులు..
ఇవన్నీ గొప్పోళ్లు
చేస్తే లబ్దికి
సామాన్యుడైతే కూటికి
తేడాలొస్తే కాటికి..
చాతుర్వర్ణం మయాసృష్టని
గీతలో గోవిందుడన్నాడేమో
దాన్నే ఆసరా చేసుకుని
బహువర్ణం మాయాసృష్టని
మన రాజకీయ కోవిదులు..
రాజనీతి బహువిదులు
ఉపకులాలు..సంకులాలు
పుట్టించి చివరికి
వ్యాకులాలు మిగిల్చారు..!
కులముంది గనకనే రిజర్వేషన్లు
డెకరేషన్లు..డిక్లేరేషన్లు..
ఫాసిజాలు..ఫాక్షనిజాలు..
పరాకాష్టగా ఫేవరిజాలు..
ఇవన్నీ పచ్చినిజాలు..!
కులాల పేరిటే
పదవుల పంపిణీ..
దామాషా అనే తమాషా
ఇలాగే కదా హమేషా..!
ఇదే సామాజిక న్యాయమైతే
సమసమాజం మాటేమిటి..?
ఈ ఉద్యమాలు,ఉన్మాదాలు.
మినహాయింపులు..
సముదాయింపులు..
లాలింపులు..బుజ్జగింపులు..
కేటాయింపులు “కోటా”యింపులు..
కొందరి పెదవివిరుపులు..
ఇవన్నీ అవసరమా..?
ప్రజ్వరిల్లే హింస..కాల్పులు..
మరణాలు..
విద్యార్థులలో వైషమ్యాలు..
కళాశాలల్లో ఉద్రిక్తతలు..
వర్శిటీలలో ఆందోళనలు..
ధీసిస్సులకు క్రైసిస్సులు..
కులాలవారీగానే
ప్రొఫెసర్ల ఆశీస్సులు..!
మనోడే..
ఎక్కడికెళ్లినా
ఇదే మాట..ఇలాగే పరిచయం..
మనవాడైతే విస్తరాకు..
పెరవాడైన ఎంగిలాకు..
కులసంఘాలు..కార్పొరేషన్లు..
ఆర్థికసాయాలు..
ఇవన్నీ ఓట్ల కోసం తరుణోపాయాలు
కుళ్లిపోయిన భౌతికకాాయాలు!
కులమతవర్గవర్ణ రహిత సమాజం..
చిన్నప్పటి నుంచి
వింటున్న మాట..
ఎప్పటికీ విడివడని
నీటిమూట..
మహనీయులు కలలు కన్న
బంగారు బాట..
ఉత్తిమాట..!?
చివరగా ఒక మాట..
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపైనా కులప్రభావమే..
అమరావతి చుట్టూ
ఫలానా కులం వారే
భూములు కొనేసారని
ఆ కులానికి చెందిన వారి
ఇళ్ళే అధిక అద్దెలకు
ప్రభుత్వం తీసుకుంది గనక
రాజధానిని తరలిస్తున్నారని ప్రచారం..
ఇది గ్రహచారం..
మరి అధికారంలోకి వచ్చాక
అత్యధిక కీలక
మంత్రి పదవులు..
ఉన్నత పదవులు స్వకులం వారికే కట్టబెట్టిన ఉదంతాలు బలుపా..వాపా..
గురివింద నలుపా..!?
నీకైనా..నాకైనా
ఇంకెవరికైనా ఓ బుజ్జీ..
ఇదేనయా
వద్దనే కులగజ్జి..
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286