Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఆవిరవుతున్న మామిడి, జీడి మామిడి రైతుల ఆశలు…రాలుతున్న పూత-పిందె

ఆవిరవుతున్న మామిడి, జీడి మామిడి రైతుల ఆశలు…రాలుతున్న పూత-పిందె

బుట్టాయగూడెం :మామిడిపండు పేరు వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. అలాగే జీడిపప్పును ఇష్టపడని వారు ఉండరు.. మామిడి, జీడి మామిడి ఈ రెండు పంటలు తోబుట్టువులుగా ఒకే కాలంలో రావడం విశేషం. వేసవి కాలానికి స్వాగతం పలుకుతూ పూసే మామిడి, జీడి మామిడి పూతల సువాసనలు, ఆ చెట్ల లేత చిగురులు తింటూ కూసే కోయల కూతల మధురిమలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తాయి. ప్రస్తుతం మామిడి, జీడి మామిడి తోటలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సీజన్ మొదట్లో విరగబోసిన మామిడి, జీడి మామిడి తోటలు ఆ తరువాత కాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో చీడపీడలకు గురవుతున్నాయి. టీ దోమ, వేరు, కాండం తొలుచుపురుగు, పూతలో పట్టే పురుగు, పిందెరాలుట, పిందె కుళ్ళు, కాయ అడుగు భాగంలో మచ్చతో కూలిపోవడం, కాయ నుండి జిగురు కారడం లాంటి చీడపీడలతో మామిడి, జీడి మామిడి రైతులుతీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పశ్చిమ ఏజెన్సీలోని బుట్టాయగూడెం మండలంలో రైతులు సుమారు 6వేల ఎకరాల్లో జీడి మామిడి 158 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం సంభవించిన మిచాంగ్ తుఫాన్ ప్రభావం మామిడి పూత పై పడి, పూతస్థాయి తగ్గిపోయినట్లు తెలుస్తుంది. పూతస్థాయిని దాటిన పిందే పై కూడా వాతావరణ ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు. జీడిమామిడి లో కూడా ఇటీవల కురిసిన మంచు వలన పూత పెద్ద ఎత్తున కుళ్ళి, ఎండిపోయి, రాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు. దీనిపై మండల ఉద్యానవన శాఖ అధికారిణి ఆర్. నవీన మాట్లాడుతూ సాధారణ పరిస్థితులలో ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు గంటల జీడి మామిడి గింజలు దిగుబడి వస్తుందని, కానీ ప్రతికూల పరిస్థితులు వలన మూడు నుండి మూడున్నర క్వింటాళ్ల దిగుబడి రావచ్చని తెలిపారు. రైతులు పూర్తి దిగుబడి సాధించడానికి యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించాలని అన్నారు. కొమ్మ కత్తిరింపులు, చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. టీ దోమ నివారణకు లేండా సైహాలత్రిన్ ఒక మిల్లీలీటర్ మందును ఒక లీటరు నీళ్లలో కలిపి పిచికారి చేయవలసి ఉంటుందని, కాండం వేరు తొలుచు పురుగు నివారణకు వేప పేస్టుతో రంధ్రాలను మూసివేయడం, లేదా పురుగును పట్టుకొని చంపేయడం చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా గింజమొక్కలతో పెంచిన తోటలు కావడం, తోటల వయసు కూడా ఎక్కువ కావడంతో గింజల సైజు తగ్గిపోయి, దిగుబడి తగ్గుతుందని తెలిపారు. హైబ్రిడ్ మొక్కలతో జీడిమామిడి తోటలను పెంచడం శ్రేయస్కరమని దీనివలన ఎక్కువకాలం, ఎక్కువ దిగుబడులను సాధించవచ్చు అని తెలిపారు. హైబ్రిడ్ అంటు తోటల్లో వేరు నుండి వచ్చే కొమ్మలను తప్పనిసరిగా కత్తిరించాలని, సయాను కొమ్మను మాత్రమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఒక ఎకరానికి సుమారు 100 మొక్కలు చొప్పున పెంచుకోవాలని, దీని వలన మొక్కలకు గాలి వెళుతురు సక్రమంగా సోకి, మంచి దిగుబడులను సాధించవచ్చని అన్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో తన పరిధిలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల నుండి సుమారు వందమంది రైతులను, పదిమంది వ్యవసాయ శాఖ సహాయ సిబ్బందిని వెంకటరామన్న గూడెంలోని వైయస్సార్ యూనివర్సిటీకి తీసుకువెళ్లి మామిడి, జీడిమామిడి సాగులో మెలకువలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన రైతులకు ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా వర్మి కంపోస్ట్, బయో ఫెర్టిలైజర్స్, స్ప్రేయర్లు, కాండం కత్తిరించు పరికరాలు, 200 మంది రైతులకు ఒక్కొక్కరికి నాలుగున్నర ఎకరాల సరిపడగా 400 నుండి 500 వంతున హైబ్రిడ్ జీడి మొక్కలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో జనవరి నెలలో పలువురు శాస్త్రవేత్తలచే రైతులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. మామిడి, జీడిమామిడి సాగులో రైతుకు కావలసిన సాంకేతిక సలహాలను, ఇతర సాగు సూచనలను ఎప్పటికప్పుడు అందించడానికి రైతు భరోసా కేంద్రం ద్వారా ఉద్యానవన శాఖ సిద్ధంగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారిణి నవీన స్పష్టం చేశారు.

మండల ఉద్యానవన శాఖ అధికారిణి ఆర్. నవీన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article