ఆలకించారు.. ఆపన్నహస్తం అందించారు..
- దివ్యాంగునికి గంటలోనే ట్రై సైకిల్ పంపిణీ
- ఆనందబాష్పాలతో కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారుడు
ప్రజాభుమి ప్రతినిధి,విజయవాడ:
దివ్యాంగుని వద్దకే వెళ్ళి సమస్యను ఆలకించి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గంటలోపే అమలుచేసి దివ్యాంగుని కోరికను నేరవేర్చి మానవత్వాన్ని చాటుకున్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణంలో అనుకోని సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అనే అంశంపై నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ముగించుకుని తిరువూరు పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చూపులు తనవైపు దీనంగా చూస్తున్న దివ్యాంగునిపై పడ్డాయి.. ఆయనకు రెండు కాళ్లు పనిచేసే స్థితిలో లేవు. కలెక్టర్ వద్దకు నేరుగా వచ్చి సమస్యనూ చెప్పుకోలేని దీనస్థితి. దీంతో కలెక్టరే స్వయంగా దివ్యాంగుడు కూర్చున్న చోటికి వెళ్లారు. మోకాళ్ళపై కూర్చున్నారు. ఆశగా చూస్తున్న దివ్యాంగుడిని చిరునవ్వుతో పలకరించి, ఎక్కడి నుంచి వచ్చారు… ఏమిటి పరిస్థితి.. ఎందుకోసం వచ్చారు అని అడిగారు. కలెక్టర్ ప్రశ్నలు విన్న దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. విజయవాడ పటమట 10వ డివిజన్‌కు చెందిన గద్దె తంబి తన చేతిలో ఉన్న ఆధార్ కార్డు, తన వికలాంగత్వాన్ని నిర్ధారణ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కలెక్టర్‌కు చూపిస్తూ తనకు ఉపాధి ఏమీ లేదని, నడవలేని స్థితిలో ఉన్నానని తనకు ట్రై సైకిల్ సమకూరిస్తే దాంతో జీవిస్తానని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ను అభ్యర్థించారు. కలెక్టర్ ఆ వికలాంగుడు ఇచ్చిన పత్రాలను పరిశీలించి, తప్పకుండా సమస్యను ఈరోజే పరిష్కరిస్తానని ఆధైర్య పడవద్దని ధైర్యంతో బ్రతుకు బాటలో ముందుకు వెళ్ళాలని భుజంతట్టి తిరువూరు పర్యటనకు బయలుదేరారు. వెంటనే దివ్యాంగుడు కోరిన విధంగా మూడు చక్రాల వాహనాన్ని తక్షణం సమకూర్చాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దివ్యాంగుని విజ్ఞప్తిపై ప్రత్యేక శ్రద్దపెట్టిన జిల్లా కలెక్టర్.. మార్గమధ్యంలో దివ్యాంగునికి మూడు చక్రాల వాహనం సమకూర్చడంపై జిల్లా రెవెన్యూ అధికారి దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులను ఆరా తీయడంతో సరిగ్గా గంటలోనే దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కామరాజు మూడు చక్రాల వాహనాన్ని సమకూర్చగా.. జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం గద్దె తంబికి అందజేశారు. ఒక దివ్యాంగుడు తనకు దారి చూపాలని దీనంగా అడిగిన అభ్యర్థన కలెక్టర్ గుండెల్ని పిండేసింది. ఇటువంటి వారికి చేసే సేవ విధి నిర్వహణలో భాగమే అయినా.. మానవత్వంతో స్పందించే గుండె కూడా ఉండాలి కదా. సరిగ్గా అటువంటి హృదయం కలిగిన కలెక్టర్‌కు మూడు చక్రాల వాహనం పొందిన వికలాంగుడు గద్దె తంబి ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ సమయంలో తనకు ఉచితంగా వాహనం అందజేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, మానవత్వం ఉన్న అధికారులు ఉన్నారంటే నమ్మేవాడిని కాదని.. కానీ జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు చూసి మానవత్వం కలిగిన అధికారులు ఉన్నారని నమ్ముతున్నానని తంబి అన్నారు.