ఆదివాసి గిరిజన సంఘం
బుట్టాయగూడెం:ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా మండలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు నాగేశ్వరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని1/59 మరియు1/70 చట్టాలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని అధికారులను కోరారు. బుట్టాయిగూడెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో, శివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో , సొసైటీ ఆఫీస్ పక్కన మరియు రామారావు పేట సెంటర్ వద్ద నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవని, దీని మీద వెంటనే నిర్మాణాలు చేపట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసి గిరిజన చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాతపూర్వక వినతి పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్ కు, బుట్టాయిగూడెం పంచాయతీ కార్యదర్శి కిరణ్ కు, రెడ్డి గణపవరం పంచాయతీ కార్యదర్శికు అందించినట్లు చెప్పారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడ్డా పవన్, కె. జలపాలు , పూనం దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
