Wednesday, February 4, 2026

Creating liberating content

Uncategorizedఅనంత"లో 'స్కై ఫ్యాక్టరీ"..!!

అనంత”లో ‘స్కై ఫ్యాక్టరీ”..!!

  • సార్లా ఏవియేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
  • మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1300 కోట్లు
  • 500 ఎకరాల్లో ఏర్పాటు
  • 150 ఎకరాల్లో మొదటి దశ పనులకు అంగీకారం
  • ఫేజ్ వన్ పనుల కోసం రూ.330 కోట్లు కేటాయింపు

( పులివారి హరిప్రసాద్ )
( ప్రజాభూమి, అనంతపురం బ్యూరో )

అనంతపురం జిల్లాలో భారీ స్కై ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చక చక అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫ్లయింగ్ ట్యాక్సీల తయారీ పరిశ్రమ కరువు జిల్లాలో ఏర్పాటు కానుంది. దీంతో జిల్లా ప్రజల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. భారతదేశంలోనే ఇది మొట్ట మొదటి పరిశ్రమ గా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ విమానాలే ప్రత్యేకం…

ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలో తయారయ్యే విమానాలు… ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ( ఈ విటిఓఎల్ ) విమానాలుగా పేర్కొంటున్నారు. వీటిని ఫ్లయింగ్ ట్యాక్సీలు ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక విమానాల తయారీ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సార్లా ఏవియేషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అనంతపురం జిల్లాలో భారీ ‘స్కై ఫ్యాక్టరీ’ ఏర్పాటు కానున్నట్లు అధికారిక సమాచారం. ఇది దేశంలోనే మొదటి గిగా స్థాయి ( ఈ విటిఓఎల్ ) తయారీ కేంద్రంగా నిలుస్తుంది.

కియా తర్వాత మరో భారీ ప్రాజెక్టు…

ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఉత్పత్తి ప్రారంభించిన కియా కార్ల పరిశ్రమ తర్వాత రాబోయే మరో భారీ ప్రాజెక్టు ఈ విమానాల తయారీ పరిశ్రమ. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం మొత్తం రూ.1,300 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో సమగ్ర సౌకర్యాలతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. డిజైన్, తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటి అన్ని దశలను ఇక్కడే చేపట్టేలా సమగ్రమైన డీపీఆర్ రూపొందించారు. మొదటి దశ కింద 150 ఎకరాల భూమిలో రూ.330 కోట్లతో పనులు ప్రారంభమవుతాయి. పరిశ్రమ నిర్మాణ పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని అంచనా. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు సంవత్సరానికి సుమారు 1,000 ( ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ) విమానాల తయారీ సామర్థ్యం ఉంటుందని అధికారిక అంచనా.

విద్యుత్ శక్తి ఆధారం .

ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలు పూర్తి విద్యుత్ శక్తితో నడుస్తాయి. ఈ ఆధునిక విమానాలకు రన్‌వే అవసరం ఉండదు. ఈ విమానాలు నిలువుగా ఎగిరి, దిగగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. శబ్దం తక్కువ. కాలుష్యం శూన్యం. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా భవిష్యత్ ఎయిర్ ట్యాక్సీలుగా పరిగణిస్తున్నారు. ఈ విమానాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని భావిస్తున్నారు. సార్లా ఏవియేషన్ సంస్థ 2028 నాటికి భారతదేశంలో మొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్నెన్నో లాభాలు…

ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు అనేక లాభాలను తెచ్చిపెడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సార్లా ఏవియేషన్ సంస్థతో ఒప్పందం వల్ల వేలాది హై-టెక్ ఉద్యోగాల సృష్టితో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు తరలి వస్తాయి. యువతకు అత్యాధునిక టెక్నాలజీ శిక్షణ లభించడంతో పాటు అనంతపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తుంది. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ ఈ ఒప్పందం ద్వారా సాధ్యమవుతాయి.

మేక్ ఇన్ ఇండియాకు ఊతం…

దేశ స్థాయిలో చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా భావనకు బలమైన ఊతం కాబోతోంది. భారతదేశంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యు ఏ ఎం)కు బాటలు వేస్తుంది. దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఎగుమతుల అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయి.
ప్రస్తుతం తయారీ కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో టెస్ట్ ఫ్లైట్స్, సిటీ ఎయిర్ ట్యాక్సీ సేవలు వరకు విస్తరిస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతుల వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భారతదేశ ఆకాశ రవాణాలో స్వావలంభన, ఆవిష్కరణల దిశగా వేస్తున్న గొప్ప అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ రవాణా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించడానికి, రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మలుపు అవుతుందనడంలో సందేహం లేదు.

19 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article