మంత్రి వేణుగోపాల్ కృష్ణ.
ప్రజాభూమి, కాజులూరు
అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం రామచంద్రపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సమగ్ర శిక్షా విభాగం ఆధ్వర్యంలోని కాజులూరు భవిత కేంద్రంలో చదువుతున్న 8 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన మూగ, చెవిటి దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాప్ లతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం సమాజ ప్రగతికి ఎంతో అవసరమని, ఈ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత, కేటాయింపులు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఆంగ్ల మాధ్యమంలో బోధన, టాబ్ ల పంపిణీ ఎన్నో కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య పేదలందరికీ అందుబాటులోకి వచ్చిందని, రాష్ట్ర విద్యా రంగంలో నవ శకం ఆవిష్కారమైందన్నారు. దివ్యాంగ విద్యార్థులలో నిభిడీకృతమైన ప్రజ్ఞా పాటవాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, అందరితో పాటు వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని మంత్రి కోరారు. భవిత కేంద్రంలో చదువుతున్న పిల్లలకు ట్యాబ్ ల ద్వారా మరింత మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులు, శిక్షకులను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గుబ్బల ఏసురాజు, కాజులూరు జెడ్పిటిసీ సభ్యులు వనుం వెంకట సుబ్బారావు, భవిత కేంద్రం ఐఈఆర్పి యం.జె.పి.రెడ్డి, మండల విద్యాశాఖాధికారి పి.జాన్ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.