బుట్టాయిగూడెం.: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బుగ్గన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొరగం మాట్లాడుతూ బుగ్గన బడ్జెట్ అంచనాలు కొండంత ఖర్చులు మాత్రం శూన్యం అని విమర్శించారు. రాష్ట్రంలో 13 వేల కోట్ల లోటు రెవెన్యూ లోటును అసమర్థ విధానాలతో వలన 44 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదే అని ధ్వజమెత్తారు. పన్నులు, బాదుడు తప్ప బడ్జెట్ కొత్త అంశాలు ఏమిలేవని, ప్రస్తుతం రాష్ట్ర అప్పులు 11.58 లక్షల కోట్లుకు చేరిందని, మద్యం బాండ్ల పై 16 వేల కోట్లు, కార్పొరేషన్ తనఖాల ద్వారా 94,938 కోట్లు, డిస్కం బకాయిలు 27,284 కోట్లు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు 95,400 కోట్లు ఉన్నాయని వివరించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అప్పులు రెట్టింపు అయ్యాయి తప్ప రాష్ట్రంలో ప్రజలకు చేసింది ఏమీలేదని, 2014 నుండి 2019 వరకు టిడిపి పాలనలో తీసుకున్న అప్పు కంటె 4 రెట్లు అధికం అయ్యాయని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని, వైసిపి ప్రభుత్వంలో అమలు చేసే ప్రతి స్కీమ్ వెనుక భారీ స్కామ్ ఉందని తెలిపారు. మాట్లాడితే సంక్షేమం అని చెప్పే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడని, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ వలన ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదని, రాష్ట్రంలో ధరల పెంపు, పన్నుల భారం, రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంపు, ఎన్నడూ లేనివిధంగా కరెంట్ చార్జీలు 7 సార్లు పెంపు, చివరకు విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్లో కూడా వెయ్యి కోట్లు అవినీతి, నాడు నేడు పేరుతో స్కూల్స్ కు రంగులు వేసి 3 వేల కోట్ల అవినీతి చేశారని ఇలా చెప్పుకుంటే పోతే అన్నివిధాలా ప్రజలను ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఈ సమావేశం లో పలువురు తెలుగుదేశం సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.