- జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్
- ఎస్సై, ఆపై స్థాయి పోలీసు అధికారులతో ఉరవకొండలో ఎస్పీ ప్రత్యేక సమావేశం
అనంతపురము
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన జిల్లాలోని ఉరవకొండలో సీఎం పర్యటించనున్నారు. సీ.ఎం. పర్యటన పురస్కరించుకుని బందోబస్తులో పాల్గొనే ఎస్.ఐ., ఆపై స్థాయి పోలీసు అధికారులుతో సోమవారం ఉరవకొండలో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచీ తిరుగు ప్రయాణమై వెళ్లేంత వరకూ నిర్వహించాల్సిన పటిష్ట భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బందోబస్తులో భాగంగా … ఉరవకొండలోని హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్, తదితర ప్రాంతాల్లో ఎలాంటి బందోబస్తు చర్యలు చేపట్టాలో వెల్లడిస్తూ గట్టి ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు కాన్వాయ్ , మొబైల్ పార్టీలు, రోప్ పార్టీలు, బి.డి. టీం, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, తదితర బృందాల సిబ్బందికి విధులు అప్పగించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విచ్చేసే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎలా వ్యవహరించాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. బందోబస్తును సెక్టార్లు వారీగా విభజించి… సెక్టార్ల ఇన్ఛార్జీలుగా అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సుచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి, నాగరాజు, హనుమంతు (ఏ.ఆర్), పలువురు డీఎస్పీలు, సీ.ఐ. లు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.