జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె హబీబ్ బాషా.
బుట్టాయగూడెం:రానున్న ఖరీఫ్ సీజన్ కు సాగు పనులు మొదలవుతున్నాయని, రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి, సహాయ సహకారాలు అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె . హబీబ్ బాషా సూచించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో సోమవారం డీఈవో హబీబ్ బాషా రైతు భరోసా కేంద్రాల వ్యవసాయ సహాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదును పదును తెలుసుకొని చేసేది వ్యవసాయమని, విఎఒ లు రైతులకు తగు సలహాలు, సూచనలు అందిస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి రైతులకు సహకరించాలని అన్నారు. పలు అంశాలపై వ్యవసాయ సహాయకులకు ఉన్న విషయపరిజ్ఞానాన్ని పరిశీలించారు. సాగు క్షేత్రాల సందర్శనలతో సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, పంటలకు వచ్చే చీడపీడల వివరాలపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలలో వరి సాగు జరుగుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా 11 వేల క్వింటాళ్ళ జనము, జీలుగ, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను గిరిజన రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50% సబ్సిడీపై అందించినట్లు చెప్పారు. దీనిలో 6వేల క్వింటాళ్లు జీలుగ, 2500 క్వింటాళ్ల జీలుగ, 2500 కింటాళ్ళ పిల్లి పెసర విత్తనాలను రైతులకు అందించినట్లు చెప్పారు. పచ్చిరొట్టను పూత దశలో భూమిలో దున్నినప్పుడు పూర్తి పోషకాలు భూమికి అందుతాయని చెప్పారు. జిల్లాలో 70 వేల ఎకరాల సాగుకు సరిపోయే 18 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులను, విత్తనాలను పూర్తిస్థాయిలో అందించడానికి జిల్లా వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోట రామచంద్రపురం ఏ డి ఏ పి. బుజ్జిబాబు, మండల వ్యవసాయ అధికారి డి. ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.