ఇంతకీ అది
వానప్రస్థమా..హీనప్రస్థమా..
ఎన్ని వసతులున్నా
వృద్ధాశ్రమమేగా..
సొమ్ముల్లేకపోతే అనాధాశ్రమం
లక్ష్మీపుత్రులైతే కాస్త ఖరీదు..
మొత్తానికి అమ్మానాన్నలకు
ఓ గుడ్ బై..
ఇంటికి దూరంగా..
భూమికి భారంగా..
జననీజనకులను
అక్కడికి పంపేసి
బిడ్డలేమో టింగురంగా!
ఇప్పటికే వృద్ధాశ్రమాలు కిటకిట…
బిడ్డలు విదేశాల్లో..
తల్లిదండ్రులు ఆశ్రయం లేక ఆ”శ్రమా”ల్లో..
వాళ్ళు రారు..వీళ్ళు వెళ్ళరు!
ఇది ఇంటింటి పోరు..
అడ్డాల నాటి పిల్లలకు
గడ్డాల నాటి అడ్డాలు
విదేశాలు..
డాలర్ డ్రీమ్స్..
ఇక్కడ పెద్దలకు
ఓల్డేజి హోమ్స్..
విదేశీ సంస్కృతి..
మారిపోతున్న మన ఆకృతి..
భారతీయ ప్రకృతికి
నయా వికృతి..!
ఎన్నో కుటుంబాల్లో
ఒంటరి బ్రతుకులు..
జీవితమంతా
బిడ్డల కోసం యాతన
వయసు మళ్లేపాటికి
అదే పిల్లలకు భారమై..
సంతోషం దూరమై..
సుతుని సంతసం కోసం
సతితో కలిసి వానప్రస్థం..
దాని పేరే వృద్ధాశ్రమం..
గౌరవంగా ప్రేమసమాజం..
ఇంకా మెరుగ్గా
ఓల్డ్ ఏజ్ హోమ్..!
#
ఇ.సురేష్ కుమార్
9948546286