*వీడు ఆమ్మాడు…నేను కొంటున్నాను…
*నేనమ్ముతున్నాను… వేరేవాడు కొంటున్నాడు ..
*పది రూపాయలకు అమ్మి అరవై రూపాయలవి తింటున్నాడు…
*అమ్మే వాడిని బలవంతం చేయలేదు…
*ఈ బియ్యం తినలేక ..ఉచితం కాబట్టి అమ్ముకుంటున్నాడు…
*అధికారుల తనిఖీలు మాములే…
*ఇవన్నీ ప్రభుత్వాలకి తెలియకుండానే జరుగుతాయా…?
*అంతా చేతులు మారడమే…
*ఏ చేయి తడపాలో తడిపితే అంతా అయిపోతుంది…
*ఇది రేషన్ మాఫీయా వారి మాటలు…
*మరి ఈ అధికార వ్యవస్థలెందుకు…
*ఇంటిటింటికీ వెళ్లి బియ్యం ఇవ్వడమెందుకు…
*ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చి ఈ మాయలేమిటి ..
*పేదవాడు తినలేని బియ్యం పరాయి దేశాలు తింటున్నాయే…
*ఈ బియ్యం అక్కడ వారికి రుచిస్తున్నాయా…
*తినలేనప్పుడు ఇన్ని తిప్పలెందుకు…
*ఇన్ని తెల్ల రెషన్ కార్డులెందుకు..
*ఇంత మంది అధికారుల పర్యవేక్షనెందుకు…
*ఇక ప్రభుత్వమే ఉండేడేందుకు…?
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
“లచ్చులో… లచ్చులో…
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే”అన్న చందాన ఈ రేషన్ మాఫీయా గాళ్ల రాజ్యంలో పేదల బ్రతుకులు బిచ్చగాల్ల లాగా అవుతున్నాయని చెప్పడానికి సిగ్గుచేటు. ఈ నెల ఏలూరు జిల్లా చాట్రాయి లో ఆ తరవాత విజయవాడలోని పటమట,సింగ్ నగర్ ప్రాంతంలో పట్టుబడిన రేషన్ మాఫీయా గాళ్ల తీరు చూస్తుంటే ప్రభుత్వం ఎంత అచేతనంగా ఉందొ అట్లే అర్ధమవుతుంది.
రేషన్ అక్రమ రవాణా,పట్టుబడిన విధానాల పై ప్రజాభుమి సంచలనాత్మక కథనాలను అందిస్తుండగా కొంత మాఫీయా గాళ్ళు తమ పైశాచికత్వం చూపిస్తూ పేద ప్రజలను ఎంత చులకన భావనతో ఉన్నారో అన్న దానికి పై పాట అద్దం పడుతుందని చెప్పక తప్పడం లేదు.ఇక్కడ ఏది నీతి? ఒకడికి నీతి అయినది ఇంకొకడికి అవినీతి కావచ్చు.. ఒకడి సుఖం ఇంకొకడి కష్టం కావచ్చు. Everything is relative. ఏది నీతి.. ఏది పరబ్రహ్మను అర్థం చేసుకున్న బ్రహ్మజ్ఞానం? అంతా శూన్యం అంతా మిధ్య. అందులోనుండి పుట్టి గిట్టేదే జగమంత కల్పన. పూర్వమేప్పుడో మహనీయులు ఇలాంటి గొప్ప విషయాలు చెప్పడానికి ఉన్న పరమార్థం ఇప్పుడిప్పుడే అవగతం చేసుకోవాలి.ఎందుకంటే వర్థమాన పరిస్థితుల్లో ప్రజాస్వామ్య యుతంగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకుని వారిని చూసి నీతి న్యాయం ధర్మం అన్నది ఆలోచన చేయాలి.
పేద ప్రజల కోసం తెల్ల బువ్వ తినాలని నాడు స్వర్గీయ ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని రూపకల్పన చేశారు. పనికి ఆహార పథకం అని ఇలా అనేక రకాలుగా పేద ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వాలు ప్రజా పంపిణీ చేస్తుంటే అదే ప్రభుత్వం లో ఉన్న కొంతమంది నీతి లేని నేతలు, అవినీతి అధికారులు వల్ల రేషన్ మాఫీయా గాళ్ళు రెచ్చిపోతున్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకుని పేదల పొట్టి కొట్టి పరాయి రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తూ యథేచ్ఛగా దోచుకుతింటున్న విషయం సంబందిత అధికారులకు స్పష్టంగా తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారో అర్థం కానీ పరిస్థితి దాపరించింది.అయితే ఈ బియ్యం కేటుగాళ్ళలో కొంతమంది తాము చేస్తున్నది తప్పేమిటని అంటుంటే ఈ అధికార వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో అవగతం కావడం లేదు.నిస్సిగ్గుగా వాడు అమ్ముతున్నాడు… వీడు కొంటున్నాడు… వీడు అమ్ముతున్నాడు…మేము కొని పరాయి వాడికి అమ్ముకుంటున్నామని ఎంత ఇదిగా చెబుతున్నారో తెలిస్తే అచ్చర్య పడాలో సిగ్గుపడాలో రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగమే సమాధానం చెబితే చక్కగా ఉంటుందని అంటున్నారు కొందరు ప్రజలు.
అమ్మేవాడు పది రూపాయలు తీసుకుని 60 రూపాయల రేటుతో వేరే బియ్యం కొనుగోలు చేసి తింటుంటే ఇక్కడ బలవంతం ఎక్కడ ఉందని చెప్పుకొస్తున్నారు ఈ అక్రమ దారులు. ఇది కూడా నిజమే కాబోలు మరి. రేషన్ బియ్యం తినలేక అమ్ముకునే వాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వ అధికారులకు తెలియదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అమ్ముతున్న బియ్యం కొనుగోలు చేసి తరలిస్తుంటే అధికారులు తనిఖీల పేరుతో వస్తుంటారు పోతుంటారు …తాము చేసేది చేస్తుంటాం అని బాహాటంగా అంటుంటే ఇక రేషన్ బియ్యం పంపిణీ కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం అవసరమా అన్న ఆలోచన లో ప్రజలు ఉన్నారు చాట్రాయి గ్రామంలో ఉన్న చైతన్యం అన్ని గ్రామాలలో ఉంటే పేద ప్రజల బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటాయని మెజార్టీ ప్రజలు అనుకుంటున్నారు.ధర్మాజీ గూడెంలో ,చింతలపూడి, జంగారెడ్డిగూడెం లోని మొత్తం అధికార ఘనం అండగా ఉంటున్నారనే ఆరోపణ లలో కొంత వాస్తవం లేక పోలేదు. అక్కడ రెవెన్యూ పోలీస్ మరీ దగ్గరుండి అన్ని వ్యవహారాలు చక్కబెడుతుండగా ఏలూరు జిల్లా సీవిల్ సప్లై అధికారులు బియ్యం మాఫీయా గాళ్లతో చీకటి ఒప్పందాలు చేసుకున్న ట్లు కూడా బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కూడ చూసి చూడ నట్లు వ్యవహరించడం మూలాన రేషన్ మాఫీయా యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా పట్టుబడుతున్న రేషన్ బియ్యం, డాన్ లంటూ బెదిరింపులు ,వెకిలి చేష్టలకు దిగుతుంటే అధికార యంత్రాంగం నిస్సేష్ఠులై ఉన్నారనే భావన ప్రజల్లో నుండి వ్యక్తమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడు అర్థాకలితో చావల్సిందేనన్న ధోరణి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం దార్శనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో కూడా ఈ పాపాత్ములు పేదల బియ్యం దోచుకు తింటుంటే ఇక పేదవాడికి తిండి తిప్పలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.