10 గంటలు దాటితే రోడ్లపై కానరాని జనం.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచన.
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి లో గత రెండు రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఇల్లు వదిలి బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండ తాపం నుండి బయట పడేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు ప్రారంభం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఎండలు 41 డిగ్రీలకు చేరుకోవడంతో చిన్నపిల్లలు ,వృద్ధులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రోజున 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా శనివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగైదేళ్లుగా నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది అధికమవడంతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏవైనా పనుంటే ఉదయమే పూర్తి చేసుకుని ఉదయం 9, 10 గంటల్లోపు ఇళ్లను చేరుకుంటున్నారు. ఎండల్లో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ తగలే ప్రమాదం లేకపోలేదని డాక్టర్లు వెంకట చిరంజీవి, రాజ్ కుమార్లు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకు బయటకు వెళ్ళరాదన్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులను ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాలలు మధ్యాహ్నం 12:30 గంటలకు వదులుతున్నారని ఆ సమయంలో విద్యార్థులు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎండ నుండి ఇంటికి వచ్చిన వెంటనే చన్నీటితో స్నానం చేయించాలన్నారు. పిల్లలు గానీ, వృద్ధులు గాని అస్వస్థతకు గురైతే చల్లని ప్రదేశంలో ఉంచి నిమ్మకాయ రసం గాని, ఓ ఆర్ ఎస్ ద్రావణంగాని త్రాగించాలని వైద్యులు సూచించారు. ఎండలు తగ్గేంతవరకు పై సూచనలు పాటించాలని డాక్టర్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు ఒకే తీరుగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మండే ఎండల నుండి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.