కనిగిరి
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం ప్రజా రవాణా శాఖ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం చేపట్టారు.రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు.ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు.రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు.కనిగిరి ఆర్‌టిసి డిపో మేనేజర్ బి.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత కాలంలో యువత ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని తెలిపారు.ఇందుకు కారణం వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారానే జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అన్నారు.ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.రహదారులు నీడ నిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలుతో తడిసిపోకూడదనే ఉద్దేశంతో పాఠశాలలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సలర్ దేవరాజ్,పాఠశాల ప్రిన్సిపాల్ పెరియా నయగ మేరీ,సిస్టర్ ఎలిజీబెత్ రాణి, సిస్టర్ రాఖీని,డిపో అసిస్టెంట్ మేనేజర్లు,ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు,గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.