గుండ్లకుంట శ్రీరాములు….
కడప సిటీ :బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలోకి టిడిపి చేరిక ఆత్మహత్యకు మించిన అపరాధం అని గుండ్లకుంట శ్రీరాములు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. 2014లో ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ తూచా అమలు చేస్తామని బిజెపి చేతిలో చెయ్యేసి చెప్పిందని నాడు టిడిపి, జనసేన ప్రకటించాయి. మోడీ, చంద్రబాబు, పవన్ ఉమ్మడి వేదికలపై సమిష్టిగా చేతులెత్తి అభివాదాలు చేసి మరి ఓట్లు అడిగారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు అధికార పీఠాలు ఎక్కి రాష్ట్రానికి సాధించింది ఏమిటి? మొదటి నాలుగేళ్లు అక్కడా, ఇక్కడా పదవులు పంచుకొని చెట్టాపట్టలేసుకు తిరిగారు. 2014లో ఎందుకు కూటమి కట్టారు, 2019లో దేనిపై విబేధించి విడిపోయారు. మరల 2024 ఎందుకు కలుస్తున్నారు అనే ప్రశ్నలకు ఆ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా శ్రీరాములు కోరారు. రాష్ట్రాన్ని బిజెపి అంధకారంలోకి నెట్టగా, బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పెను చీకట్లు చీల్చడానికంటున్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసిన బిజెపితో సాన్నిహిత్యం కొత్త శుభారంగా వారికి కనిపించిందా?. రాష్ట్రాన్ని శిథిల సాధన చేసిన బిజెపి అభివృద్ధి కాచుకుంటుందట. కూటమిని ఆశీర్వదిస్తే రాష్ట్రం తెప్పరిల్లుతుందని భాష్యాలు చెబుతున్నారు. కావున రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో పార్టీలను, వారి అవకాశాన్ని, పనితీరును పరిశీలించి అన్ని విధాలా ప్రజలకు న్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని గుండ్లకుంట శ్రీరాములు ఈ సందర్భంగా కోరారు. విలేకరుల సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, పిసిసి డెలిగేట్ పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామలమ్మ పాల్గొన్నారు.