ఆంజనేయ స్వామి, రామాలయాల్లో ప్రత్యేక పూజలు.
లేపాక్షి :-మండల కేంద్రమైన లేపాక్షి తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రామనామ స్మరణతో హోరెత్తాయి. అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో మండల పరిధిలోని ఆంజనేయ స్వామి, రామాలయాల్లో సీతారాముల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన లేపాక్షి లోని రామాలయంలో ఉదయం సీతా,రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలకు అభిషేకార్చన నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, భక్తజన సందోహం మధ్యన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. అదేవిధంగా లేపాక్షి భజన మందిరంలో యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారాముల చిత్రపటాలకు పుష్పాలతో అలంకరించి ,పూజలు నిర్వహించారు. అనంతరం లేపాక్షి గ్రామ వీధుల గుండా భజన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో భజన అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో జెండాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని పులమతి వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మండల పరిధిలో బిసల మానేపల్లి, చోళ సముద్రం, సిరివరం , మానేపల్లి, కంచి సముద్రం, కల్లూరు, నాయన పల్లి, మద్దిపి తదితర గ్రామాల్లో సీతారాముల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి గ్రామాల్లో ఊరేగింపు చేశారు .ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వినియోగం గావించారు.