పిడిఎస్ యు, పి వై ఎల్ డిమాండ్
బుట్టాయగూడెం
భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ విడుదల చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేశాయి. స్థానిక పి ఆర్ భవన్ లో గురువారం పిడిఎస్ యు, పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పి వై ఎల్ జంగారెడ్డిగూడెం డివిజన్ సహాయ కార్యదర్శి టి. బాబురావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టకముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని భర్తీ చేస్తానని హామీ ఇచ్చి, నేడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కేవలం 6100 ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం లక్షలాదిమంది నిరుద్యోగులు కోట్లాది రూపాయలతో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటే కంటి తుడుపు చర్యగా అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తామనడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమే అన్నారు.ఇది మెగా డీఎస్సీ కాదు మినీ డీఎస్సీ అని దుయ్య బట్టారు. పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు బి. వినోద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నేను ఉన్నాను…. నేను విన్నాను… నేను చూసాను… మాట ఇస్తే మడమ తిప్పను … అని నిరుద్యోగులను మభ్యపెట్టి అదికారం చేపట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేశారన్నారు. ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం రోజున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేశారన్నారు. నేడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నిరుద్యోగుల ఓటు బ్యాంకింగ్ కోసం కేవలం 6100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామనడం హేయమైన చర్య అని విమర్శించారు. కావున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 55 వేల ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మినీ డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు పూనెం రాముడు, కబడ్డీ శంకరు, పిడిఎస్ యు నాయకులు నిఖిల్,చరణ్ తేజ,మంగరాజ్, నాగిరెడ్డి, రామ్ చరణ్, రామ్ చరణ్ పాల్గొన్నారు.