రెక్కలు వచ్చినప్పటి నుంచి..
డిసెంబర్ 31 రాత్రి..
ఎంత సంబరం..
వయసుకు తగ్గట్టు
ఆ రోజున ఎంత హడావిడి
చదువు..ఉద్యోగం..
వ్యాపకం..
ఆయా సందర్భాలను అనుసరించి
ఒక్కోసారి
కొత్త మిత్రులు చేరినా
పర్మనెంట్ బాచ్
ఒకటి తప్పదు..
అల్లీకాయలాట నుంచి
బడి ఎగ్గొట్టే బాట మొదలు..!
ఆ రాత్రి నెమరువేసుకునే
మధురస్మృతులు..
ఒకనాడు..
కంబైన్డ్ స్టడీస్ పేరిట
వేసిన వెధవ్వేషాలు..
పరీక్ష హాల్లో మీనమేషాలు..
ఒకొరికొకరు
స్లిప్పుల సరఫరా..
హాల్లోంచి బయటకొస్తూ బిరబిరా..
ఎలా రాశావురా..
ఔరా..ఇదో ప్రశ్న..
ఇంట్లో చెప్పకుండా సినిమాలు..
మర్చిపోయి ఓనమాలు..!
ఇక అదే రాత్రి…
తొలిసారిగా సిగరెట్టు ముట్టించిన ద్రిల్లు..
బీరు సీసా మూత నోటితో తెరిచేందుకు పెద్ద డ్రిల్లు..
సిగిరెట్టయితే
ఘాటని వెరపు..
బీరేమో చేదని
పెదవి విరుపు..
అదంతా మొదటిసారే..
మర్నాడో..మరో ఏడో
బాచ్ సారే..లిసారే..లిసారే!
ఇక సీక్వెన్సా..
మూడుముక్కలా..
ప్లేసులు ఎతుక్కుని
చీట్ల పేక..
ఎంత ఆడినా తీరని కాక..
ఇలాంటి తియ్యని అనుభూతులు ఎన్నో..
అనుభవాలు ఎన్నెన్నో..
గుర్తుకొస్తున్నాయి..
గుర్తుకొస్తున్నాయి..!!
సరే..ఎంత రాసినా
తరగని జ్ఞాపకాలు..!
2025..
ముగిసిన కత..
2026..
మొదలయ్యే కొత్త కథ..
మలుపు కానే కాదు ముగింపు..
వేచి చూస్తున్న మెరుపు..
ఆనందాల పిలుపు..
సంబరాల మేలుకొలుపు..
ఇది ఒక సంవత్సరానికి
అంతం మాత్రమే కాదు..
కొత్త ఆనందానికి ఆరంభం..
ఆశ కాదు..విశ్వాసం..
రేపటి రోజు..
సంబరాల రివాజు..
ఎన్నో చేదు అనుభవాలు..
కొన్ని స్వానుభవాలు..
దుష్టసంహారాలు
ఎప్పటికీ కావు అసంభవాలు!
చెడుకు..చేదుకు స్వస్తి..
దుర్మార్గానికి తగిన శాస్తి..
కష్టాలకు నాస్తి..
సర్వే జనా సుఖినోభవంతు
ఇక సంబరాలే
మానవాళి వంతు!!
గడుస్తున్న వత్సరానికి వీడ్కోలు..
కొత్త సంవత్సరంలో
అన్నీ బాగుండాలని వేడుకోలు..
శుభాకాంక్షలతో…
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

