ఖతార్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ మాజీ నేవీ అధికారులను విడుదల చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎనిమిది మందిలో ఏడుగురు ఇప్పటికే భారత్ కు తిరిగి వచ్చేశారని వెల్లడించింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్ లు గర్ల్స్ లో ఆల్ దహ్రా అనే కంపెనీలో పనిచేశారు. అయితే వీరిని 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు గూఢచర్య ఆరోపణలపై అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కెప్టెన్ నవ తేజ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ వశిష్ట, కమాండర్ అమిత్ నాగపాల్, కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సంజీవ గుప్తా, కమాండర్ నాగ సుగుణాకర్ పాకాల ఉన్నారు. వీరందరికీ గతేడాది అక్టోబర్లో అక్కడి కోర్టు మరణదండన విధించింది. భారత్ కు ఈ విషయాన్ని తెలియజేయకుండానే ఖతార్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే మరణశిక్ష విధించబడిన భారత మాజీ ఉద్యోగుల కోసం రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అనంతర పరిణామాలలో న్యాయస్థానం నేవీ మాజీ అధికారులకు విధించిన మరణ శిక్షను జైలు శిక్షగా గతేడాది డిసెంబరు 29వ తేదీన తగ్గిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నేవీ మాజీ ఉద్యోగులను కాపాడేందుకు అన్ని న్యాయ మార్గాలను వినియోగించుకున్న భారత్ ఈ ప్రయత్నంలో సఫలీకృతమైంది. ఇక తాజాగా దీనిపై జరిగిన విచారణ నేపథ్యంలో ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసి వారిని విడుదల చేసింది.