కదిరి :రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ కు జనం హారతులు పట్టి పూలమాలలతో స్వాగతం చెబుతూ బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం కదిరి రూరల్ మండల పరిధిలోని పందలకుంట గ్రామపంచాయతీలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందలకుంట గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపగా తక్షణమే స్పందించిన ఆయన కదిరి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకే బస్సు సర్వీసు గ్రామానికి వచ్చే విధంగా చేశారు. దీంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న జగనన్న ఆశయం నెరవేర్చడానికి బస్సు సౌకర్యంతో పాటు ఏ అవసరం ఉన్న వారికి తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. సంక్షేమ సారధి జగనన్నపై ఉన్న అభిమానంతో తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తేలియజేశారు. మా పెద్ద కొడుకు జగన్ కే మా ఓటు అంటూ చెబుతున్న అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పారు. సోదరి గీతాంజలి మరణంపై చర్చించుకుంటున్న జనం దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని, దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ పొత్తుతో ఏకమవుతున్న తోక పార్టీలన్నింటినీ జగనన్న చిత్తు చేస్తారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనం ఫ్యాను గుర్తుకే ఓటేస్తామని ఏకపక్ష నిర్ణయం ప్రకటిస్తుండడం చూస్తుంటే జగన్ ప్రభంజనం సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యుల పూల శ్రీనివాస్ రెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, రూరల్ మండలం కన్వీనర్ ప్రకాష్, ఎంపీటీసీ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు కుర్లి శివారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.