బోరు విద్యుత్ సౌకర్యం కోసం నిలదీసిన సర్పంచ్ ,ఎంపీటీసీ
హిందూపురం టౌన్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పినా ఇంత నిర్లక్ష్యమా.. అంటూ మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను అధికార పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలు నిలదీశారు. హిందూపురం మండలం మలుగూరు లో తాగునీటి బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నెలల తరబడి అడిగిన ఇవ్వలేదంటూ మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ రమేష్, ఎంపిటిసి సభ్యురాలు తులసి విద్యుత్ శాఖ అధికారితో వాగ్వివాదానికి దిగారు. బుధవారం మండల పరిషత్ అధ్యక్షురాలు రత్నమ్మ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, వేసవి కాలంలో తాగునీటి ఎద్దడిని అధిగమించడానికి మరొక బోరుకు విద్యుత్ సరఫరా చేయాలని ఎంత విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాతపూర్వ క లెటర్ ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమస్యలపై అధికారులకు ఫోన్ చేసినా ఏమాత్రం స్పందించడం లేదన్నారు. మలుగూరు పంచాయతీ పరిధిలోని నందమూరి నగర్ లో విద్యుత్ వైర్లు తెగిపడి ప్రజలకు ప్రాణహాని ఉందంటూ ఎన్నిసార్లు అధికార దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన తమకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు మీరేం చేస్తారంటూ నిలదీశారు. ప్రతి చిన్న విషయానికి మంత్రి దృష్టికి తీసుకెళ్లలేక మిన్నకుండి పోతున్నామంటూ అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో పలుసార్లు ఈ అంశంపై చర్చించినప్పటికీ ఫలితం లేదన్నారు. వీరి నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధులుగా తాము గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను సత్వర పరిష్కారం చేయాలంటూ మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం మండలంలో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జడ్పిటిసి నాగభూషణం, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు