- చట్టపరమైన చర్యలు తప్పవు
- సీఐ చాంద్ బాషా
వేంపల్లె
మండలంలోని తాళ్లపల్లె గ్రామంలో భారీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లె సీఐ చాంద్ బాషా వెల్లడించారు. శుక్రవారం రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు. పోలీసుల వివరాల ప్రకారం తాళ్లపల్లె గ్రామానికి చెందిన పగిడిపల్లి బాబావల్లి ఆ గ్రామంలో చికెన్ అంగడి నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అధిక డబ్బులు సంపాదించేందుకు అక్రమంగా మద్యం బాటిళ్లను అధిక ధరలకు విక్రయించేవాడు. వేంపల్లె పట్టణంలోనీ ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ప్రతి దఫాకు రెండు, మూడు బాటిళ్ల చొప్పున ఎమ్మార్పీ ధరకు కొనుగోలు చేసి, అదనంగా రూ.30-50 లకు చూట్టు ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. దీంతో రాబడిన సమాచారం మేరకు తనిఖీ చేయగా అతని వద్ద 126 మద్యం బాటిళ్లు పట్టుబడినట్లు వివరించారు. అనంతరం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాల్ నాయక్, ఏఎస్సై శ్రీనివాసమూర్తి, హెడ్ కానిస్టేబుల్ అయ్యవారురెడ్డి, ఆంజనేయులు, కానిస్టేబుళ్లు కిరణ్, వీరన్న పాల్గొన్నారు.