అంచనాలు కొండంత.. ఖర్చులు గోరంత
తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ ఇంచార్జి మాధవి రెడ్ది
కడప అర్బన్
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ ఇంచార్జి ఆర్. మాధవి రెడ్ది స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గారడితో మాయ మాటలు చెప్పారని ఆమె ఆరోపించారు. గురువారం ఆమె కడపలో మీడియాతో మాట్లాడుతూ.. రూ.13వేల కోట్ల రెవెన్యూ లోటును.. రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ.60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేనని తెలిపారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవు. ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.11.58 లక్షల కోట్లు. మద్యం బాండ్లు – రూ. 16,000 కోట్లు. కార్పొరేషన్ హామీలు – రూ. 1,10,603 కోట్లు. కార్పొరేషన్ తనఖాలు – రూ. 94,928 కోట్లు. డిస్కమ్ బకాయిలు – రూ. 27,284 కోట్లు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు – 95,400 కోట్లు. వీటన్నింటిని పరిశీలిస్తే వైసిపి హయాంలో ఏపీ అప్పులు రెట్టింపు అయ్యాయని ఆమె ఆరోపించారు.2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్ల అప్పు. అప్పులాంధ్రప్రదేశ్ గా ఏపీని మార్చిన ఘనత జగన్ అండ్ కో కే దక్కుతుందన్నారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ప్రతీ స్కీము ఓ స్కామ్ గా మారింది. వైసీపీ హయాంలో ధరల పెంపు.. పన్నుల భారం పెరిగిందని ఆమె ఆరోపించారు.