బీజేపీ నేత హత్య కేసులో 15 మంది దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును కేరళలోని ఒక సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో దోషులకు ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమమని భావిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన 15 మందికి కేరళ కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. ఆ 15 మంది నిషేధిత తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చెందిన వారుగా తేలింది.
దోషులుగా తేలిన 15 మంది నిందితులను కోర్టు జనవరి 20న దోషులుగా నిర్ధారించింది. అనంతరం, జనవరి 30న వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. తల్లి, పిల్లలు, భార్య కళ్లెదుటే బాధితుడిని దారుణంగా, కిరాతకంగా హతమార్చిన తీరు అత్యంత అరుదైన నేరాల పరిధిలోకి తీసుకువస్తుందని పేర్కొంటూ దోషులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఆయన శరీరంపై 56కు పైగా గాయాలు ఉన్నాయని తెలిపింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులందరూ దోషులుగా తేలినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరం సమయంలో రంజిత్ తల్లి, సోదరిపై శారీరకంగా దాడి చేయడం, గృహోపకరణాలను ధ్వంసం చేయడం వంటి ఇతర నేరాలు కూడా రుజువయ్యాయని తెలిపింది.

