ఓ వైపు తండ్రి మృత దేహం… మరో వైపు ఇంటర్ పరీక్షకు హాజరు!
హిందూపురం :ఓ ఇంటర్ విద్యార్థిని.. మృతి చెందిన తండ్రి బాధలను దిగమింగుకొని… బరువెక్కిన గుండెతో పరీక్షకు హాజరైన సంఘటన బుధవారం హిందూపురంలో చోటు చేసుకోగా అందరి హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ఇంటిలో తండ్రి మృతదేహం… ఉదయం 9 గంటలకు ఇంటర్ పరీక్ష.. తీవ్రంగా రోదిస్తూ.. తండ్రి ఆశయాల సాధన కోసం బాధలను భరిస్తూ… ఇంటర్మీడియట్ ద్వితీయ పరీక్షకు హాజరైన వైనం చూపురులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈటీవీ రిపోర్టర్ గా పేరుగాంచిన సిద్దు(38) మంగళవారం రాత్రి గుండె నొప్పితో హఠాన్మరణం చెందాడు. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండడం… సిద్దు హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం రోదనలు వర్ణనాతీతం. ఇలాంటి విచార సంఘటనల నేపథ్యంలో పెద్ద కుమార్తె తస్లీమ (17) ఇంటర్ ద్వితీయ పరీక్షకు వెళ్లాల్సిన పరిస్థితి… ఓవైపు తండ్రి మృతదేహాన్ని చూస్తూ రోదిస్తూ… ఇక మా జీవితం ఏమి… తండ్రి లేక మా కుటుంబం ఎలా… అంటూ కన్నీటి పర్వంతరమైంది. అయితే కుటుంబ సభ్యులు… సిద్దు స్నేహితులు ఆ అమ్మాయిని ఓదారుస్తూ… నీకోసం తండ్రి సిద్దు చదివించేందుకు ఎంతో శ్రమించాడని… తండ్రి ఆశయాల సాధన కోసం పరీక్షలు రాయాలని సూచించడంతో బరివెత్తిన హృదయంతో పరీక్షకు హాజరైంది. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాసి వచ్చిన తస్లీమా తండ్రి మృతదేహం పై పడి బోరున విలపించడం అందరి హృదయాలను కలచివేసింది. కాగా పరీనాభాను(11)… ఖుషి (3) కుమార్తెలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆవేదనకు లోనయ్యారు. కాగా వివిధ వర్గాలు తమ వంతు ఆర్ధిక సహాయం అందించారు. సీనియర్ రిపోర్టర్ సూర్య ప్రకాష్ రూ.10వేల అందించి కుటుంబ సభ్యులను ఓదార్పు చేశారు.
