బుట్టాయగూడెం :తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిని ప్రాధాన్యత క్రమం ప్రకారం పరిష్కరిస్తామని కోటరామచంద్రపురం గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఎం. సూర్యతేజ అన్నారు. కె.ఆర్. పురం, ఐటిడిఎ సమావేశ మందిరంలో గిరిజన సమస్యల పరిష్కార వేదిక గిరిజన దర్బార్ బుధవారం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు తమ సమస్యలను గిరిజన దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పి ఓ సూర్య తేజ మాట్లాడుతూ గిరిజన దర్బార్ కు అందిన సమస్యలను పరిశీలించి, ఆయా శాఖల అధికారులతో సమస్యలపై చర్చించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయా శాఖల అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. రానున్న వర్షాకాలంలో నీటి నిల్వలు పెరిగి దోమలు వృద్ధి చెంది ప్రజల జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలలో 100 శాతం నూతన ప్రవేశాలను సాధించాలని, బడి బయట పిల్లలందరినీ తప్పనిసరిగా బడిలో ప్రవేశపెట్టే విధంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు. తొలకరి ప్రారంభమైనందున వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతాయని, రైతులకు సాంకేతిక పరంగా, ఇతర అన్ని విధాలుగా వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు అందించి, రైతులకు అండగా ఉండాలని అన్నారు. ఈ గిరిజన దర్బార్ లో ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కలెక్టర్ వెట్రిసెల్వికి పిఓ అభినందనలు.
జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెట్రిసిల్విని కోట రామచంద్రపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎం.సూర్యతేజ బుధవారం ఏలూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వివో సూర్య తేజ పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికి, అభినందించారు.

