కదిరి
కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ యం.యస్. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను సోమవారం మండల విద్యాధికారులు చెన్నకృష్ణ, ఓబులరెడ్డిల చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ ఇంజనీర్లు చేసే పెద్దపెద్ద స్మార్ట్ ప్రాజెక్టులను విద్యార్థులు చిన్న నమూనాలుగా చేసి ప్రదర్శించారన్నారు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్రాజెక్టులను సోమ, మంగళవారం ప్రదర్శించడం జరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా విద్యార్థులు చేసిన 3డి ప్రింటర్స్, స్మార్ట్ స్ట్రీట్ లైట్స్, స్మార్ట్ ఇరిగేషన్, రైన్ డిటెక్టర్, స్మార్ట్ బ్రిడ్జ్, సోలార్ ప్రాజెక్ట్, స్మార్ట్ విలేజ్, ఆటోమేటిక్ రైల్వే గేటు, రోబో, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు ఎంతో ఆకర్షణీయకరంగా ఉన్నాయని విద్యాధికారులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

