బుట్టాయగూడెం:తమ భూముల సాగు కోసం సాగునీరు ఇప్పించమంటూ ఒక రైతు వేడుకున్నాడు. కోట రామచంద్రపురం ఐటిడిఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఐటిడిఏ పథక నిర్వహణ అధికారి ఎం.సూర్యతేజకు పలువురు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ క్రమంలో బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంకు చెందిన ఎల్లంపాటి సత్యనారాయణ తమ సాగు భూములకు పోగొండ జలాశయం నుండి సాగునీరు ఇప్పించమని కోరారు. కుకునూరు మండలం దాచారం కు చెందిన మిడియం వెంకటస్వామి, ఎరకం ముత్తయ్య అనువార్లు తమ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా విన్నవించుకున్నారు. పోలవరం మండలం కొండ్రుకోట వాడపల్లి గ్రామానికి చెందిన సున్నం ప్రవళిక తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున తాను విధులు నిర్వహిస్తున్న రాజానగరం గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ప్రతిరోజు తన ఇంటి వద్ద నుండి విధుల నిర్వహణకు హాజరయ్యే విధంగా అనుమతిని కోరారు. ప్రజల వద్ద నుండి అందిన పలు వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి, చర్యలు చేపడతామని పిఓ సూర్యతేజ తెలిపారు. ఈ గిరిజన దర్బార్లో గిరిజన సంక్షేమ శాఖకు, ఏడు మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.