పేద విద్యార్థులపై మానవత్వంతో వ్యవహరించండి
- అడిగిన వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ, ఓబీసీ సర్టిఫికెట్స్ ఇవ్వండి
- మండల రెవెన్యూ అధికారులకు డా.పోతుల నాగరాజు విజ్ఞప్తి
- అనంతపురము :పేద విద్యార్థులకు అడిగిన వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ, ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వండని, పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించి పనిచేయండని
రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా.పోతుల నాగరాజు విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్ కోసం ఇచ్చే వాటికి కూడా అవినీతికి పాల్పడవద్దని సూచించారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని కోరారు.
ఈ మేరకు రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బందికి విన్నపం చేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు ప్రవేశాల కోసం ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలు, యూనివర్సిటీలు, మెడికల్, ఇంజనీరింగ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్ వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలు వారికి అవసరమైన కుల,ఆదాయ, ఓబీసీ, స్థానికతకు సంబంధించిన పత్రాలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకు, లేదా వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ సర్టిఫికెట్ల జారీలో మీరు ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా కేవలం మానవత్వంతో పిల్లలను దీవించి మంచి మనసుతో అడిగిన వెంటనే ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని రాష్ట్రలోని మండల రెవెన్యూ అధికారులకు డా.పోతుల నాగరాజు విజ్ఞప్తి చేశారు.
కొద్దీ మంది అధికారులకు అనవసరమైన నిబంధనలతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు తమ దృష్టికి తీసుకుని రావడంతో ఈ ప్రకటన ఇవ్వడం విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమని ఎందుకంటే మండల అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఏ మండలంలోను విద్యార్థులకు ఇబ్బందులు కలిగించ కుండా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.