Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుపిఠాపురం జనసేన లో అంతర్గత పోరుతంగెళ్ళ వైఖరి పై నాయకుల అసంతృప్తి:మొగలి శివప్రసాద్

పిఠాపురం జనసేన లో అంతర్గత పోరుతంగెళ్ళ వైఖరి పై నాయకుల అసంతృప్తి:మొగలి శివప్రసాద్

  గొల్లప్రోలు

     పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉన్నా నాయకుల మధ్య మాత్రం అంతర్గత పోరు రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ స్థానిక నాయకులను విస్మ రిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. తంగెళ్ళ వైఖరికి నిరసనగా ఏకతాటి పైకి వచ్చిన స్థానిక నాయకులు అంతర్గతంగా సమావేశమవుతున్నట్లు సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి అభిమానులు,కార్యకర్తలకు కొదవలేదు. నాయకులతో సంబంధం లేకుండా కార్యకర్తలే చందాలు వేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులకు గత ఎన్నికలలో టికెట్టు లభించలేదు. కాకినాడకు చెందిన  మాకినీడి శేషు కుమారిని అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా స్థానికేతరు రాలైనప్పటికీ ఆమె విజయానికి అందరూ కృషి చేయడంతో ఆమెకు 28 వేలకు పైగా ఓట్లు లభించాయి. ఈసారి ఎన్నికల్లోనైనా అదృష్టం వరిస్తుందని నాయకులు తమ సొంత ఖర్చులతో పోటాపోటీ గా సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. గత ఏడాది జనసేనాని పవన్ పిఠాపురంలో నిర్వహించిన వారహి యాత్రతో పార్టీకి మరింత జోష్ పెరిగింది. అదే సమయంలో పవన్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విబేధాలతో పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు. పవన్ యాత్ర అనంతరం అప్పటి వరకు జనసేన ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన మాకినీడి శేషుకుమారి ని తప్పించి ఆమె స్థానంలో టీ టైమ్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసస్ ను నియమించారు.

       తంగెళ్ళ కు వ్యతిరేకంగా.....

        పిఠాపురంలో నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేస్తారన్న ఉద్దేశంతో అధిష్టానం నియమించిన  తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్  ఏకపక్ష తీరు పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ తో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా ఆయన తమను కలుపుకు వెళ్లడం లేదని ఆరోపిస్తున్నారు. తంగెళ్ళ బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రజా సమస్యలకు సంబంధించి ఒక్క పోరాటం కూడా చేపట్టలేదని పేర్కొంటున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి పార్టీలో చేరికల పేరుతో హడావిడి చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టడం లేదంటున్నారు. మొదట్లో తంగెళ్లతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు ఆయన వ్యవహారశైలి మింగుడు పడక ఒక్కరు ఒకరూ దూరమవుతున్నారు.సోషల్ మీడియాలో ప్రచారం పై చూపే శ్రద్ధ నాయకులు కార్యకర్తలను కలుపుకుపోవడంలో చూపడం లేదని అంటున్నారు. ఇటీవల టిడిపి నుంచి వచ్చిన వలస నాయకులకు ప్రాముఖ్యత ఇస్తూ పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నాయకులను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి.  ప్రస్తుత ఇన్ ఛార్జ్ కంటే గతంలో పనిచేసిన శేషు కుమారినే బెటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పొందినా ఆమె ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారని ఎన్నో సమస్యలపై పోరాటం చేసారని గుర్తు చేస్తున్నారు .తంగెళ్ల బౌన్సర్లను మెయింటైన్ చేస్తూ  తమకు కలుసుకునే అవకాశం ఇవ్వటం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాకినాడలో పవన్ పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన నియోజకవర్గ నాయకుల సమావేశానికి సంబంధించి కూడా తమకు సమాచారం ఇవ్వలేదని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. సదరు సమావేశానికి టిడిపి నుండి వలస వచ్చిన కొంతమంది నాయకులను మాత్రమే తీసుకెళ్లి అందరూ వచ్చినట్లు మభ్య పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి వారుగా వ్యవహరించిన పార్టీ నియోజకవర్గ నాయకులు  తంగెళ్ల వైఖరితో విసిగి ఏక త్రాటి పైకి వచ్చి  స్థానికేతరుడైన ఉదయ్ కు కాకుండా తమలో ఒకరికి టిక్కెట్ కేటాయించాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నట్లు సమాచారం. తంగెళ్లనే అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తంగెళ్ళ అభ్యర్థిత్వంపై అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే పిఠాపురం సీటు టిడిపికే కేటాయించేలా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు ముద్రగడ జనసేనలో చేరితే  ఆయనే అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించి ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి అధిష్టానం  క్లారిటీ ఇవ్వకపోతే కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article