వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు తాజాగా టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గంలో పని చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మమేకం అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ టికెట్ పై ఇంకా ఆశలు వదులుకోని స్ధానిక నేత బొమ్మసాని సుబ్బారావు మాత్రం ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ తరఫున ఆయన తండ్రి, వసంత నాగేశ్వరరావు.. మైలవరంలోని బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తన కుమారుడికి సహకరించాలని కోరారు. అయితే అందుకు సుబ్బారావు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. వసంత కృష్ణ ప్రసాద్ కు సహకరించేది లేదని బొమ్మసాని సుబ్బారావు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో వసంత నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నాయకులను కలుస్తున్న కృష్ణ ప్రసాద్.. బొమ్మసాని సుబ్బారావు వ్యవహారం మార్చి 2 న అధికారికంగా టీడీపీలో చేరాక చూద్దామనే భావనలో ఉన్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్ధి, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. దీంతో బొమ్మసాని సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ వసంత కు కాదు…తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు డిమాండ్ చేస్తుండటం సమస్యగా మారింది.దీంతో సదరు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరతారా లేదా అన్న చర్చ మొదలైంది.