బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ వంటిదని.. నలంద అంటే జ్ఞానాన్ని అందించే విద్యా కేంద్రం అని అన్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకున్నారని.. నాడు ప్రపంచంలోనే ఓ ప్రముఖ విద్యాకేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం విరాజిల్లిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అంతకు ముందు మోడీ విదేశీ రాయబారులతో కలిసి యూనివర్సిటీ ముందు నిల్చోని ఫోటోలు దిగారు. అలాగే ప్రారంభోత్సవం సందర్భంగా రాయబారులతో కలిసి మొక్కలను నాటారు.


