కమీషనర్ కు కౌన్సిలర్ల ఆల్టిమేటమ్
గొల్లప్రోలు
గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ప్రస్తుత పాలకవర్గం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు ఎమ్ బుక్ రికార్డుల తో సహా తెలియపరచాలని లేని పక్షంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్ కు కౌన్సిలర్లు ఆల్టిమేట్ జారీ చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని మేనేజర్ రామ్ ప్రసాద్ కు అందజేశారు.14,15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు ఎం బుక్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం తెలియపరచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.పట్టణ పరిధిలోగల ప్రతి సచివాలయానికి ఇచ్చిన 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పనుల వివరాలు అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పనుల వివరాలు, ఒక లక్ష రూపాయల లోపు నీళ్లతో కౌన్సిల్ ఆమోదం ప్రకారం పనులు చేపట్టిన వారి వివరాలు ఏ ప్రాంతంలో పనులు నిర్వహించారో పనుల వివరాలు తెలియపరచాలని కోరారు. గతంలో ఒక్కొక్క సచివాలయం పరిధిలో 99 వేల రూపాయల వ్యయంతో నిర్వహించిన పాట్ హోల్స్ వివరాలు తెలియపరచాలని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లపై చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు తెలియపరచాలని సదరు అంశాలను ఈనెల సాధారణ సమావేశం లోపు తెలియపరచాలని లేని పక్షంలో సమాచార హక్కు చట్టం ప్రకారం మున్సిపల్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు. వినతి పత్రంపై సంతకం చేసిన వారిలో వైస్ చైర్ పర్సన్లు తెడ్లపు అలేఖ్య రాణి, గంధం నాగేశ్వరరావు, కౌన్సిలర్లు గంటా అప్పలస్వామి,మొగలి దుర్గారావు, దమ్మాల లక్ష్మి, గొల్లపల్లి అచ్యుతాంబ, బావిశెట్టి జ్ఞానేశ్వరి, మొగలి వెంకట జయలక్ష్మి, కూరాకుల శేఖర్, సింగం నాగేశ్వరరావు ఉన్నారు.