ముక్కోటి ఏకాదశి పర్వదినాన దురదృష్టకర సంఘటన.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం .
కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా.
రామచంద్రపురం: బి.ఆర్.అంబేద్కర్ కొనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వద్దగల సప్త గోదావరి సమీపంలో గల శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంస చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అలాగే దురదృష్టకర సంఘటన ముక్కోటి ఏకాదశి పర్వదినాన జరగడం మరింతగా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.ఈమేరకు మంగళవారం ఆలయానికి సమీపంలోని అతి పురాతన కపిలేశ్వర ఘట్టం వద్ద ఉన్న శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం,జన సేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వైయస్సార్సీపి ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకుని ధ్వంసం చేసిన శివలింగాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఊమీనా హుటాహుటిన ద్రాక్షారామం చేరుకుని దుండగులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రప్పించారు.దుండగులు పట్టుబడే వరకు ఈ ప్రాంతం నుంచి ఎవరూ వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించమని మంత్రి సుభాష్ చెప్పినట్టుగా ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం వివరించారు. ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డీఎస్పీ, ఆర్డీఓలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టారు. శివలింగ ధ్వంసానికి సంబంధించిన విషయంలో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని దుండగులు ఎవరైనా సరే దొరికిన వెంటనే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు ఎలాంటి సడలింపులు ఉండవని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు తెలియజేశారు. ముక్కోటి ఏకాదశి వంటి పవిత్ర దినాన ఈ తరహా దాడి జరగడం హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింత పెంచగా, పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచుతూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యదర్శి,ఈవో అల్లు దుర్గా గంగాభవాని, రామచంద్రపురం శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గణేష్ శర్మ జనసేన నాయకులు సత్యవాడ శ్రీహరి పంతులు తెలుగుదేశం నాయకులు కంచి మూర్తి బాబురావు , కాజులూరు మండల జనసేన పార్టీ యువత అధ్యక్షులు కూనపురెడ్డి శివకృష్ణ,దేవస్థానం అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దుండగులను కఠినంగా శిక్షించాలని కోరాతూ డిమాండ్ చేశారు..

