- ముందు మీ పార్టీ సంగతి చూసుకుంటే మంచిది.
- ఇప్పటికే ఓ వర్గం సహకరించకుండా ధర్నాలు చేస్తోంది
- డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నావని మీ పార్టీ వాళ్లే అంటున్నారు
- నీ వద్ద ఉన్న డబ్బుతో చంద్రబాబును, లోకేష్‌ను కొన్నట్లు అనంతపురంలో ప్రజలను కొనలేవు
అనంతపురము
తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌కు అనంతపురం ఎమ్మెల్యే అనంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభం అయ్యిందంటూ దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నగరంలోని 25వ డివిజన్‌లో శనివారం ఇంటింటికీ వైసీపీ నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే అనంత మాట్లడుతూ, రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలవబోతోందన్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని పలుకరించినా వైసీపీకే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారు. “అనంతపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాం.
వైసీపీ నుంచి వలసలు ప్రారంభ అయ్యాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటున్నారు. ముందు మీ పార్టీ సంగతి చూసుకుంటే మంచిది. ఇప్పటికే ఓ వర్గం సహకరించకుండా ధర్నాలు చేస్తున్నారు” అని హితవు పలికారు. “ఒకరో, ఇద్దరో మా పార్టీ నుంచి పోయినా పర్వాలేదు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ ఉంది. మాకు బలం ఉంది. మేం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి పనులే మాకు శ్రీరామరక్ష” అన్నారు. “నీకు డబ్బుందని అనుకుంటున్నావు. మీ పార్టీ వాళ్లే నీపై ఏం ఆరోపణలు చేస్తున్నారో గమనించు. డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నావని మీ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకూ బహిరంగంగా చెబుతున్నారు. నీ దగ్గరున్న డబ్బుతో చంద్రబాబును, లోకేష్‌ను కొన్నట్లు అనంతపురంలో కొంత మందిని కొనగలవేమో. ప్రజలను కాదు” అంటూ ఎమ్మెల్యే అనంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన స్పందిస్తూ, “మా పార్టీ (వైసీపీ) నుంచి 20 మందినో, 30 మందినో తీసుకుంటామని అంటున్నావ్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కమిట్‌మెంట్ ఎలాంటిదో చూపిస్తాం. ఎన్నికల్లో ఓట్లు కొనాలని అనుకుంటున్నావు. ప్రజాస్వామ్య దేశంలో నీకన్నా ధనవంతులను ప్రజలు చూశారు..” అన్నారు. ఎవరి పాలనలో ఎంత మంచి జరిగిందో ప్రజలకు తెలుసని, మంచిని, చెడును గుర్తించే తెలివితేటలు ఓటర్లకు ఉన్నాయని, ఇక్కడ నీ పప్పులుడకవ్ అని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ కు కౌంటర్ ఇచ్చారు.
