చంద్రగిరి:ప్రఖ్యాత శైవక్షేత్రం తలకోన కొండల నుంచి జాలువారుతున్న జలాశయ నీటిని వడిసిపట్టి వ్యవసాయ భూములకు నీటిని అందించేందుకు తప్పక కృషి చేస్తానని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తలకోన నీటి సాధన సమితి తుమ్మల గుంట నివాసం వద్ద చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తలకోన జలాల విషయమై విన్నవించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు చెరువులు, సప్లై చానళ్లు పరిశీలించి నివేదించారని తెలియజేశారు. చెరువుల ఆధునీకరణ, కట్టల బలోపేతం, సప్లై ఛానళ్ల పునః నిర్మాణం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలియజేశారు. కమల్ల చెరువు, అయ్యప్ప చెరువు, నల్ల సముద్రం, మది చెరువు, వలసల పల్లి చెరువు, సిద్దల గండి ప్రధానమైన చెరువులు గా చెప్పుకొచ్చారు. మొత్తం 764 చెరువులకు తలకోన జలపాతం నీటితో నింపే ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో తప్పక ప్రతిపాదనలు ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కలిసిన వారిలో తలకోన సాధన సమితి అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, రెడ్డప్ప తదితరులు ఉన్నారు.