Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్‌

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : తనను అరెస్ట్‌ చేయవచ్చన్న వార్తల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం చర్చ జరిగే అవకాశం ఉంది.విశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘తప్పుడు కేసులు పెట్టి పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం ఇతర రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును సాకుగా చూపి ఆప్ నేతలను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వారు ఎప్పటికీ గెలవరు కాబట్టి ఆప్ ప్రభుత్వానికి కూలగొట్టాలనుకుంటున్నారు. అయితే, మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ నుంచి విడిపోలేదు. ఎమ్మెల్యేలంతా కలిసి కట్టుగా ఉన్నారని ప్రజలకు నిరూపించడానికి నేను విశ్వాస తీర్మానాన్ని సమర్పిస్తున్నాను’’ అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ హాజరుకావాలంటూ ఈడీ పదే పదే సమన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంగా పిలుస్తున్న ఇది స్కామ్ కాదని, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వారు కోరుకోవడం లేదని బీజేపీని నేతలను ఉద్దేశించి అన్నారు. స్కామ్ సాకు చూపి ఆప్ నేతలందరినీ అరెస్టు చేశారని, ఏదో విధంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే వారి ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. బీజేపీ వాళ్లు రూ.25 కోట్లు ఇస్తామంటూ తమ వద్దకు వచ్చారని ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పారని, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వారు ఎమ్మెల్యేలను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసం తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనాలని ఎమ్మెల్యేలను కేజ్రీవాల్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article