వైసీపీ అధినేత వైయస్ జగన్
విజయవాడ:
డీఎస్సీ లో అక్రమాలు, శాప్ కార్యాలయం వద్ద జరిగిన స. ఘటన పై సిబిఐ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్అబ్దుల్ నజీర్ ను కోరారు. బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ” గవర్నర్గారిని కలవడం జరిగింది. గవర్నర్‌గారికి వివరంగా.. సెప్టెంబరు 21న జరిగిన ఘటనపైనే కాకుండా, ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయింది అనేది వివరించాము. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి. విద్యా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాలి.
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.మొట్టమొదట రెండు ఫంక్షన్లు ఒకే వ్యక్తి చేతికి అప్పగించడం. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించారు. దీంతో స్కామ్ ప్రారంభం అయింది. రెండోది మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అలా పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన పేరు తొలి మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత లిస్ట్‌లో పేరు తొలగించారు.అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంపలేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కవర్ చేయడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారు. అనేది తెలియడంతో పాటు, లీకేజీ వ్యవహారం బట్టబయలైంది. స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చారు. గతంలో ఉన్న జీఓలు రద్దు చేసి కొత్తగా.. జీఓ నెం: 4, 47 అని చెప్పి, రెండు కొత్త జీఓలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత 372 ఉద్యోగాలు ఆ జీఓల పేరుతో ఇచ్చారు. ఆ రిక్రూట్మెంట్ పూర్తి కాగానే మళ్లీ మూడు జీఓలు తెచ్చారు. జీఓ నెం: 23, 25, 56 తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి ఇక్కడ 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి సమాధానం లేదు.ఫేక్ సర్టిఫికెట్లు. ఏరకంగా నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. అలాగే ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి, సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. ఇంకాసాఫ్ట్బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో సెక్రటరీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు అనేవి కూడా చెప్పాం.డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో క్లియర్‌గా ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్ఐఆర్లో రాయలేదు. కేవలం సస్పెక్ట్ అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.సెప్టెంబరు 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా కుట్ర చేశారో చూశాం.
టీచర్లు కాని టీచర్లను పిలిపించి, ప్యారలల్‌గా ధర్నా చేయించాడు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన వారు. అందుకే వారు టీచర్లు కానీ టీచర్లు. వారిని పిలిపించి, కావాలని శాప్ ఆఫీస్ వద్ద గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గుండాలను కూడా అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి ఆఫీస్‌పై దాడి చేసింది కూడా వీరే. అంత దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు.ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం కేసులు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు పెట్టారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోంది. ఇంకా రాత్రి వేళల్లో ఇళ్లపై బడి అరెస్టులు చేస్తున్నారు.అయితే అదృష్టవశాత్తూ.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. దీని వల్ల సామాన్యులు బ్రతుకుతున్నారు.
మరోవైపు మొన్నటి శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి.శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి.తప్పు చేసింది మీరు. ప్రశ్నించే హక్కు లేదా? దాన్ని కూడా కాల రాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఉండదేమో..మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది.విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోందని “వైఎస్ జగన్ అన్నారు.

