- అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
- సంరక్షణలో లోపాలు బహిర్గతం
ప్రజాభుమిప్రత్యెకప్రతినిధి – తిరుపతి
తిరుపతి జూ పార్కులో జంతువుల మరణాలు వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకంగా కృష్ణజింకల మరణాలు ప్రజల్లో, జంతు ప్రేమికుల్లో కలకలం రేపుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇటీవల నాలుగు కృష్ణ జింకలు, అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఎనిమిది వరకు జింకలు చనిపోయినట్లు తెలిసింది. ఇవన్నీ 2 నుంచి 8 నెలల వయస్సు గల పిల్ల జింకలేనని సమాచారం. సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జూ పార్కులో ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గతంలో హైదరాబాద్ జూ పార్కు నుంచి 2011 ఆగస్టులో తెచ్చిన వైట్ టైగర్ ఇటీవల మరణించగా, వయసు పెరగడమే కారణమని అధికారులు చెప్పి కేసు మూసేశారు. అంతేకాక, జూలో ఉన్న లవ, కుశ అనే రెండు పులులలో కుశ కొంతకాలం క్రితమే చనిపోయింది. లవ అనే టైగర్ ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతూ 6 నెలల నుంచి చికిత్స పొందుతోందని సమాచారం. ఇంతలో, సఫారీ జంతువులకు సరైన షెడ్లు లేకపోవడం, జూ పార్కులో ఉన్న జంతువుల సంరక్షణ దగ్గర శుభ్రతా చర్యలు నిర్లక్ష్యం కావడం, ఆహారం సరైన ప్రమాణాలతో అందకపోవడం వంటి లోపాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. వర్షాకాలంలో పక్షుల విభాగంలో పెద్ద చినుకులు పడి పక్షులు చనిపోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా, వాటి కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
జంతు సంరక్షణలో ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది? ఒకే అధికారి ఆధ్వర్యంలో ఇన్ని లోపాలు కొనసాగుతుంటే, పైస్థాయి అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న ఇప్పుడు ఉధృతంగా మారింది. ప్రజా భూమి ప్రతినిధులు అనేకసార్లు ఈ అంశాన్ని లేవనెత్తినా, చర్యలు వేగవంతం కాకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

