4గంటలు ఆలస్యమైనా వేచిఉన్న జనం మండుటెండను లెక్కచేయని ప్రజలు జగన్ బస్సుయాత్రతో 13 గంటలు విద్యుత్ కోత ముదిగుబ్బలో పనిచేయని ఇంటర్నెట్, ఫోన్లు
ముదిగుబ్బ :ముదిగుబ్బ మండలంలో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన మేమంతాసిద్ధం బస్సుయాత్ర రోడ్ షో జనసునామిని తలపించింది. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు బుక్కపట్నం మండలంలోని ప్రజలు సైతం జగన్ ను చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ముదిగుబ్బకు ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర 11 గంటలకు సాగాల్సి ఉండగా నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అయిన జనాలు మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయక రోడ్లలోనే వేచి చూశారు. అయితే భగభగ మండే భానుడిని సైతం లెక్కచేయకుండా ఇంత పెద్దఎత్తున తరలివచ్చి వేచిఉన్న ప్రజల గూర్చిగాని, ఈప్రాంత సమస్యల గూర్చిగాని రెండు మాటలు కూడా ప్రసంగించకుండా అభివాదం చేస్తూ వెళ్లడంతో జనం వకింత అసహనం వ్యక్తంచేస్తూ బాధతో తిరిగి వెళ్లారు. ముదిగుబ్బ రోడ్ షో సుమారు 45 నిమిషాల పాటు జరిగింది. ఈసందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో ముదిగుబ్బ వైసీపీపార్టీ మండల నాయకులు భారీ గజమాలను క్రేన్ ద్వారా వైయస్ జగన్ కు వేసేలా ఏర్పాటు చేశారు. మండలంలోని రాళ్లఅనంతపురం, జొన్నలకొత్తపల్లి క్రాస్, గుంజేపల్లి క్రాస్, సంకేపల్లిక్రాస్, ఎన్ఎస్పి కొట్టాల, మల్లమ్మ కొట్టాలా, మొలకవేమల క్రాస్ తో పాటు ముదిగుబ్బలోని కస్తూర్బా కాలని, నాయిబ్రాహ్మణుల కాలని, గేటుకొట్టాల తదితర ప్రాంతాల వద్ద జగన్ బస్సుపై నుండి అభివాదాలు చేస్తూ పలుచోట్ల బస్సు దిగివచ్చి బాధితులనుతో మాట్లాడి వారి సమస్యలువిని వినతి పత్రాలు స్వీకరించారు.
13 గంటలు విద్యుత్ కోత…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముదిగుబ్బలో 13 గంటల పాటు విద్యుత్ కోత ఏర్పడింది తద్వారా కొన్ని సెల్ టవర్లు పని చేయలేదు. దీంతో ఆయా కంపెనీల సెల్ ఫోన్ల ఇంటర్నెట్, ఫోన్లు మూగబోయాయి. విద్యుత్ అంతరాయంతో యంత్రాలతో పనిచేసే దుకాణాలు మూసివేశారు. తద్వారా పలువురికి పని లేకుండా పోయింది. జగన్ బస్సు యాత్ర అమాంతం జాతీయ రహదారిపైనే కొనసాగింది. అయినా యాత్రలో బస్సుకు విద్యుత్తు తీగలు తగులుతాయనే షాకుతో పలుచోట్ల రోడ్డు దాటిన విద్యుత్తు లైన్లను ఉదయం 8 ఎనిమిది గంటలకు తొలగించి రాత్రి 9 గంటలపైన పునరుద్ధరించారు. దీంతో సుమారు 13 గంటలు విద్యుత్ కోత ఏర్పడింది. దీంతో ప్రజలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సు యాత్రలో జగన్ వెంట ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, హిందూపురం వైయస్సార్సీపి పార్లమెంటు అభ్యర్థి శాంతమ్మ స్థానిక నాయకులు నారాయణరెడ్డి, సివి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
