ఏలేశ్వరం:-
మోడీ–ఆర్.యస్.యస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రైతు – కార్మిక వ్యతరేక విధానాలను నిరసనగా కిసాన్ సంయుక్త మోర్చ్, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంద్– పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ సమ్మె విజయవంతమైంది. ఇందులో భాగంగా మండలంలోని భద్రవరం గ్రామంలో అఖిలభారత కిసాన్ మహాసభ (ఏ ఐ కె ఎమ్), అఖిలభారత వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల), ఏ ఐ సి సి టి యు లు అధ్వర్యంలో గ్రామీణ బంద్, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు మాట్లాడుతూ కేంద్రంలో ఫాసిస్టు మోడీ– బి.జె.పి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా దేశంలో ప్రజా, కార్మిక ,రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని అన్నారు. ఢిల్లీ సరిహద్దులలో రైతులపై మోడీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించి యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తుందని, దేశ ప్రజలకు ఆహారాన్ని అందించే రైతులపై ఫాసిస్టు మోడీ యుద్ద వాతావరణాన్ని సృష్టించడం దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు పొంచివుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పండించిన పంటలకు అయ్యే పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర చట్టం చేసి అమలు చేయాలని, సుపరిపాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డు ఎక్కితే నిర్బంధాలు, అణిచివేత చర్యలు ఏంటని ప్రశ్నించారు. కౌలు రైతులకే ప్రభుత్వ పథకాలు నేరుగా అమలు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాల స్థానంలో మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి, రోజు కూలి 600 రూ.లు కు పెంచాలని, కేంద్ర సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ – ఆర్.యస్.యస్ బారి నుండి దేశాన్ని, దేశ ప్రజలను రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసిటుయు నాయకులు గుర్రం వీరబాబు, ఏఐకేఎం నాయకులు బర్రె నూకరాజు, అయార్ల నాయకులు కొమ్ముకూరి ఏగులియ్య, చిల్లా కళ్యాణ్, గుల్లా సత్యవతి, వంగలపూడి రమణమ్మ, పిల్లి నూకరాజు, పోలినాటి వెంకటేశులు, వంకర సూర్య ప్రకాష్, చిల్లా సురేష్, ఎలుచూరి నూకరాజు తదితరులున్నారు.