తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్నిరోజులు కొనసాగే అవకాశం ఉందని, ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.
కాగా, మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ద్రోణి వల్ల కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి అధికారులు పేర్కొన్నారు. ఈ ద్రోణి కారణంగా మధ్య గుజరాత్లో, కేరళలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను అధికారులు మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్‌లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

